
న్యూఢిల్లీ: నల్సార్ యూనివర్శిటీ లా గ్రాడ్యుయేట్ల అడ్వకేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) నిషేధం విధించడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్యూ తనకు, విద్యార్థులకు అని.. మధ్యలో బీసీఐ ఎవరని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర మండిపడ్డారు. నల్సార్ వర్శిటీ లా గ్రాడ్యుయేట్ల నమోదు ప్రక్రియపై విధించిన నిషేధం వెంటనే ఎత్తివేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని బీసీఐని కోరారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేశారు.
వివాదం ఏంటంటే..?
నల్సార్ యూనివర్సిటీలో 2026 కాన్వొకేషన్‌కు చీఫ్ గెస్టుగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ను ఆహ్వానించాలని వర్శిటీ భావించింది. అయితే, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరారు. ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతూ వీసీ, రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన చలో పార్లమెంట్ ఇష్యూలో సీజేఐ తీరు విద్యార్థులు, పౌర హక్కుల పట్ల ఉదాసీనంగా ఉందని వారు లేఖలో ఆరోపించారు.
నల్సార్ నుంచి తాము నేర్చుకున్న రాజ్యాంగ విలువలు, న్యాయం, పౌర హక్కులకు సీజేఐ ఇటీవల వ్యవహరించిన తీరుకు పొంతన లేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. ఎంతో భావోద్వేగంతో కూడిన కాన్వొకేషన్ రోజున అలాంటి వ్యక్తి చేతుల మీదుగా డిగ్రీలు తీసుకోవడం తమ మనసాక్షికి విరుద్ధమని విద్యార్థులు స్పష్టం చేశారు. స్టూడెంట్ల జీవితంలో కాన్వొకేషన్ ఎంతో కీలకమైన సందర్భమని.. అలాంటి సమయంలో నిరంకుశంగా వ్యవహరించిన వ్యక్తిని చీఫ్ గెస్టుగా ఆహ్వానించవద్దని వారు డిమాండ్ చేశారు.
నల్సార్ విద్యార్థులపై బీసీఐ ఆగ్రహం:
వర్సిటీ కాన్వొకేషన్‌కు చీఫ్ గెస్టుగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ను పిలవొద్దన్న నల్సార్ లా విద్యార్థులపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే నల్సార్ 2026 బ్యాచ్‌కు చెందిన ఏ విద్యార్థినీ అడ్వకేట్‌గా నమోదు చేసుకోవద్దని దేశంలోని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ సర్య్కూలర్ జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని నల్సార్ వర్శిటీ వీసీని ఆదేశించింది. అయితే, బీసీఐ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బీసీఐ నిర్ణయంపై సీనియర్ న్యాయవాదులు, విపక్షాలు, లీగల్ అసోసియేషన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆ వివాదాస్పద ఆదేశాలను బీసీఐ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
సుప్రీం కోర్టుకు చేరిన ఇష్యూ:
సీజేఐ ఇన్విటేషన్ వివాదం నేపథ్యంలో నల్సార్ లా గ్రాడ్యుయేట్ల ఎన్రోల్ మెంట్‌పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బ్యాన్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఈ ఇష్యూపై శుక్రవారం (ఆగస్ట్ 14) సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్యూ తనకు విద్యార్థులకు మధ్య అని.. ఇందులో జోక్యం చేసుకోవడానికి బీసీఐ ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో బీసీఐ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని.. వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదని బీసీఐని ఆదేశించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు తాను కూడా నిరసనల్లో చురుగ్గా పాల్గొనని పేర్కొన్నారు.