Reading Time: < 1 minute

నేనూ కోర్టుకు హాజరు కాను!…లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బాటలోనే సిసోడియా

Caption of Image.
  •     జస్టిస్ స్వర్ణకాంత శర్మకు లేఖ

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్  స్కామ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ బాటలోనే ఆ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట హాజరుకావడానికి ఆయన నిరాకరించారు. ఈ మేరకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ కు మంగళవారం ఆయన లేఖ రాశారు. 

కేజ్రీవాల్ తరహాలోనే తాను కూడా గాంధీజీ సత్యాగ్రహ సూత్రాన్ని అనుసరించనున్నట్టు పేర్కొన్నారు. ‘నేను విచారణకు హాజరుకాను. నా తరఫున ఏ న్యాయవాది వాదనలు వినిపించరు. మీ పిల్లల భవిష్యత్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేతుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ నుంచి నేను న్యాయం ఆశించడం లేదు. 

సత్యాగ్రహం తప్ప నాకు మరో మార్గం లేదు’ అని సిసోడియా తన లేఖలో పేర్కొన్నారు. అలాగే, జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తరచూ ‘అఖిల భారతీయ అధివక్త పరిషత్’ కార్యక్రమాలకు హాజరుకావడాన్ని సిసోడియా తన లేఖలో ప్రస్తావించారు. కాగా.. ఈ లిక్కర్ స్కామ్​లో కేజ్రీవాల్, సిసోడియా, కవిత తో పాటు మరో 23 మందిని ఫిబ్రవరిలో ట్రయల్ కోర్టు(సీబీఐ స్పెషల్ కోర్టు) క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారిస్తున్నారు.

బాపూజీ ఆశీర్వాదం కోసం..

సత్యాగ్రహాన్ని పాటించడం తప్ప మరోమార్గం లేదని, ఇందుకు మహాత్ముడి (బాపుజీ) ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నట్టు కేజ్రీవాల్, సిసోడియా తెలిపారు.  ఈ మేరకు గాంధీ ఘాట్ ను సందర్శించి ఆయనకు నివాళులర్పించినట్టు పేర్కొన్నారు.

©️ VIL Media Pvt Ltd.