Reading Time: 2 minutes
Ravichandran Ashwin Backs Sarfaraz Khan For Ind Vs Sl 1st Test

Ravichandran Ashwin on Sarfaraz Khan: శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు ‘దేశవాళీ కింగ్’ సర్ఫరాజ్ ఖాన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. సాయి సుదర్శన్ గాయం కారణంగా తప్పుకోవడంతో.. సర్ఫరాజ్‌కు భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. దాదాపు రెండేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న సర్ఫరాజ్.. గాలే మైదానంలో జరిగే తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే తుది జట్టులో చోటు కోసం వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్‌ కూడా పోటీ పడుతున్నాడు.

ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి:

ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ భవిష్యత్తుపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు మేనేజ్‌మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. సర్ఫరాజ్‌తో స్పష్టంగా మాట్లాడాలని సూచించాడు. జట్టులో పాత్రపై స్పష్టంగా చెప్పాలని పేర్కొన్నాడు. యాష్ తన యూట్యూబ్ కార్యక్రమం ‘ఆష్ కి బాత్’లో మాట్లాడుతూ.. ‘సాయి సుదర్శన్ గాయం కారణంగా సర్ఫరాజ్ జట్టులోకి వచ్చాడు. జట్టులో అతడి పాత్ర ఏంటో స్పష్టత ఇవ్వడం చాలా ముఖ్యం. అతడిపై ఏదైనా సందేహం ఉంటే అది కూడా చెప్పాలి. ఉపఖండ పరిస్థితుల్లో జట్టుకు ఉపయోగపడగలడని భావిస్తే.. ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి’ అని అన్నాడు.

కింగ్‌గా మారవచ్చు:

‘తన పాత్ర గురించి స్పష్టంగా చెప్పినప్పుడే సర్ఫరాజ్ ఖాన్ కూడా మిగతా విషయాల గురించి ఆలోచించకుండా ఆట ఆడుతాడు. స్పిన్‌ను ఎలా బాగా ఆడాలనే దానిపై దృష్టి పెట్టగలడు. స్పిన్‌ను బాగా ఆడే సర్ఫరాజ్.. ఉపఖండ పరిస్థితుల్లో కింగ్‌గా మారవచ్చు. ఈ క్రమంలోనే కెరీర్‌ను నిర్మించుకోగలడు. కొన్ని పరిస్థితుల్లో తుది జట్టులో వద్దు అనుకుంటే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా కమ్యూనికేట్ చేయాలి’ అని ఆర్ అశ్విన్ వివరించాడు. శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టులో రెండు బ్యాటింగ్ స్థానాలకు ముగ్గురు పోటీలో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ మూడో స్థానంలో ఆడడం ఖాయం. మిగిలిన ఒక స్థానానికి సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. అయితే ఇటీవలి ఫామ్, స్పిన్‌ను బాగా ఎదుర్కొనే సామర్థ్యం సర్ఫరాజ్‌కు కలిసి రానుంది.

సర్ఫరాజ్ ఖాన్ వైపే రామన్ మొగ్గు:

మాజీ భారత బ్యాటర్ డబ్ల్యూవీ రామన్ కూడా సర్ఫరాజ్ ఖాన్ వైపే మొగ్గు చూపాడు. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఉండే అవకాశం ఉన్నందున.. ప్రత్యేక బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ను ఆడించడం టీమిండియాకు ఎక్కువ ప్రయోజనం ఇస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘టెస్టు మ్యాచ్‌లో ప్రత్యేక బ్యాటర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా బాగా ఆడుతున్నాడు. సర్ఫరాజ్ కూడా బాగా పరుగులు చేశాడు. ముఖ్యంగా స్పిన్‌ను అతడు చాలా బాగా ఆడగలడు. దూకుడుగా కూడా ఆడుతాడు’ అని అని రామన్ పేర్కొన్నాడు.