Reading Time: 3 minutes
Viswanath And Sons Telugu Movie Review Rating Suriya Mamitha Baiju Venky Atluri

Viswanath and Sons review : సూర్య హీరోగా టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ అంతా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. అయితే గతంలో తెలుగు సినిమాలు చేసి తమిళంలో డబ్ చేయడంతో అక్కడ అంతగా రిసెప్షన్ రాకపోవడంతో, ఈసారి తెలివిగా నాగవంశీ, వెంకీ అట్లూరి ఈ సినిమాని తమిళంలో రూపొందించి తెలుగులో డబ్ చేశారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా? అసలు ఎలా ఉంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

విశ్వనాథ్ అండ్ సన్స్ కథ:

సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక బిజీ బిజినెస్‌మ్యాన్. ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి తల్లి (రాధిక) కోరిక తీర్చిన అతను, ఆమె కోరిన మరో కోరికను మాత్రం తీర్చలేకపోతూ ఉంటాడు. అదే సంజయ్ పెళ్లి. చిన్నప్పుడు కొన్ని కారణాలతో పెళ్లే చేసుకోవద్దని ఫిక్సయిన సంజయ్, తల్లి ఎంత కోరుకున్నా, ఎంత బ్రతిమిలాడినా పెళ్లి జోలికి మాత్రం వెళ్ళడు. అయితే ఆమె తమ వంశం ఇక్కడితో ఆగిపోతుందని బాధపడుతుందనే విషయం తెలుసుకుని సరోగసి ద్వారా ఒక బిడ్డను కంటాడు.

అయితే ఆ బిడ్డకు అరుదైన ఒక బోన్ మ్యారో డిసీజ్ రావడంతో, బోన్ మ్యారో డోనర్ కచ్చితంగా తల్లి కావాల్సి వస్తుందని తెలుసుకొని ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు. అలా అక్కడ అతనికి మ్యాడీ (మమితా బైజు) పరిచయమవుతుంది. ఆమెను తీసుకుని ఇండియా తిరిగి వచ్చాక ఏం జరిగింది? సంజయ్ జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఎలాంటివి? అసలు ఈ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కథ ఏంటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

సూర్య కెరీర్‌లో సూపర్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘గజిని’ సినిమాలో సంజయ్ రామస్వామి క్యారెక్టర్ ఇప్పటికీ చాలామందికి హాట్ ఫేవరెట్. అలానే ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’లో సూర్య క్యారెక్టరైజేషన్ కూడా చాలామందికి ఇప్పటికీ చాలా ఇష్టం. ఈ రెండు క్యారెక్టర్లు కలిపి ఒక కథ రాసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన ఆలోచనతో ఈ సినిమా రాసుకున్నట్టు దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ప్రారంభమయ్యాక కూడా దాదాపు అలాంటి ఫీలింగే కలుగుతుంది. ఒక సూపర్ రిచ్ బిజినెస్‌మ్యాన్ తన తల్లి కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు కానీ, పెళ్లి విషయంలో మాత్రం ఏమాత్రం తొందరపడడు. అతని పెళ్లి కోసమే బతుకుతున్న తల్లికి ఆ విషయంలో మాత్రం హోప్స్ కల్పించడం కాదు కదా, అసలు ఏమాత్రం పెళ్లి ఆలోచన చేయడు.

అలాంటి అతనికి అసలు ఏమాత్రం బాదరబందీలు లేని ఓ అమ్మాయి ఎదురుపడితే, ఆమె అతని మీద ఇంట్రెస్ట్ చూపించి పెళ్లికి సిద్ధమైతే అతని జీవితంలో ఎలాంటి ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి అనే లైన్‌తో ఈ సినిమా కథ రాసుకున్నాడు దర్శకుడు. ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత 20 ఏళ్ల ఏజ్ గ్యాప్‌తో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అనే ఆసక్తికరమైన ప్రశ్నను చాలా కన్విన్సింగ్ కథతో ముందుకు తీసుకువెళ్లాడు డైరెక్టర్. ఎక్కడా లాజిక్స్ మిస్ అవ్వకుండా చాలా స్మూత్‌గా సినిమాని నడిపించడంలో దర్శకుడు పడిన తపన కనిపించింది.

సినిమా ఫస్టాఫ్ అంతా చాలా స్మూత్‌గా సాగిపోతుంది. నవ్విస్తూ, ఎమోషనల్‌గా ఆలోచింపచేస్తూ ఒకటి రెండు సన్నివేశాలలో కన్నీళ్లు తెప్పించేలా దర్శకుడు రాసుకున్నాడు. అయితే ఇంటర్వెల్ తర్వాత కథలో సడన్ చేంజ్… అప్పటివరకు చాలా సైలెంట్‌గా కనపడిన హీరోతో ఊహించని పనులన్నీ చేయించాడు డైరెక్టర్. అవి కూడా కొంతవరకు లాజికల్‌గానే ఉండడం గమనార్హం. ఇక అలా సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతూనే, చివరికి క్లైమాక్స్ ఒక హ్యాపీ అండ్ ప్రెడిక్టబుల్ వేలో క్లోజ్ చేశారు.

సినిమా కథ కొత్తదా అంటే కాదు కానీ, ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా ఉంది. ఇలాంటి లైన్‌తో ఉన్న సినిమాలు గతంలో మనం కొన్ని చూశాం, కానీ ఎక్కడా ఆ ఫీల్ రాకుండా తనదైన శైలిలో, తనదైన రైటింగ్‌తో ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఫస్టాఫ్ స్వీట్ అండ్ సింపుల్‌గా ఉంటే, సెకండాఫ్ మాత్రం కాస్త లాగ్ చేసిన ఫీల్ కలిగినా కూడా తర్వాత క్లైమాక్స్‌తో దాన్ని మరిచిపోయేలా చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో ఫోన్లలో తలపెట్టకుండా చూడగల సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. ఒకవేళ ఫోన్లలో తలకాయ పెడితే ఒక మంచి మూమెంట్ లేదా ఒక షాట్ లేదా ఒక యాక్టర్ ఎక్స్‌ప్రెషన్ మిస్ అవుతాం అని కచ్చితంగా చెప్పగలం.

నటీనటుల విషయానికి వస్తే, సూర్య సంజయ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు; తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. మమిత కూడా తనకు బాగా అలవాటైన పాత్రలోనే కనిపించింది. అయితే ఈసారి కాస్త నవ్విస్తూనే ఎమోషనల్‌గా కూడా టచ్ చేసేలా నటించింది. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ సహా మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఒకపక్క కామెడీ చేస్తూనే మరోపక్క ఎమోషనల్ చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించేలాంటి సీన్లలో అందరూ ది బెస్ట్ ఇచ్చారు.

టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, ఈ సినిమాకి దర్శకుడు మరో హీరోలా వ్యవహరించాడు. తనదైన సింపుల్ అండ్ హార్ట్ టచింగ్ రైటింగ్‌తో ప్రేక్షకులను ఏమాత్రం బోర్ ఫీల్ కాకుండా, ఒకపక్క నవ్విస్తూనే మరోపక్క కన్నీళ్లు పెట్టించేలాంటి సీన్స్‌తో తన మార్క్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక సంగీతం విషయానికి వస్తే నేపథ్య సంగీతం సరిగ్గా సరిపోయింది, పాటలు కూడా స్క్రీన్ మీద బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు మాత్రం అత్యద్భుతం, ఎందుకంటే ఏ షాట్ చూసినా సినిమా కోసం పెట్టిన ఖర్చు కనిపిస్తోంది. నిడివి విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండొచ్చు.

ఫైనల్ గా: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ క్లీన్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ విత్ ప్లెజెంట్ మూమెంట్స్.