Reading Time: < 1 minute

ఆదివాసీలపై మోదీ సర్కార్ కక్ష : ఎమ్మెల్సీ శంకర్ నాయక్

Caption of Image.
  •     ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదివాసీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ఆరోపించారు. గురువారం సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివాసీలను వనవాసీలు అని పిలుస్తూ ఆ జాతి మూలాలను, గుర్తింపును సమాజం మర్చిపోయేలా బీజేపీ కుట్ర చేస్తోందని శంకర్ నాయక్ మండిపడ్డారు. గిరిజన గూడెలను బలవంతంగా ఖాళీ చేయించి, అదానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు మైనింగ్ కోసం కట్టబెడుతున్నారని విమర్శించారు. 

ఈ అన్యాయాలను నిలదీసే ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు అనే ముద్ర వేసి అక్రమంగా అరెస్టులు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతున్నారని శంకర్ నాయక్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాతే ఆదివాసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.