Reading Time: 2 minutes
Plants That Grow In Water These Are Indoor Plants For Green Home Decoration

Indoor Plants:  ఇంట్లో పచ్చదనం ఉంటే ఆ వాతావరణమే మారిపోతుంది. కిటికీ పక్కన లేదా టేబుల్‌పై పచ్చగా కనిపించే మొక్కలు ఇంటికి అందాన్ని తీసుకురావడంతో పాటు ఫ్రెష్‌ లుక్‌ను అందిస్తాయి. అయితే మొక్కలు పెంచాలంటే మట్టి, కుండీలు, ఎరువులు, రోజువారీ సంరక్షణ అవసరమని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా చిన్న ఇళ్లు, ఫ్లాట్లు లేదా ఆఫీసుల్లో ఎక్కువ స్థలం లేకపోవడం వల్ల మొక్కలను పెంచడానికి చాలామంది ఆసక్తి చూపరు. అయితే ప్రతి మొక్కను మట్టిలోనే పెంచాల్సిన అవసరం లేదు. కొన్ని మొక్కలను నీటిలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. ఇందుకోసం ఒక గాజు జార్, బాటిల్ లేదా గ్లాస్‌లో నీటిని తీసుకుని సరైన మొక్క కటింగ్‌ను అందులో ఉంచితే సరిపోతుంది. మట్టి, పెద్ద కుండీ అవసరం లేకుండానే ఇంట్లో పచ్చదనాన్ని పెంచుకోవచ్చు. మని ప్లాంట్ మాత్రమే కాకుండా మరికొన్ని మొక్కలను కూడా నీటిలో పెంచుకోవచ్చు. మరి అవేంటో చూసేద్దామా..

స్పైడర్ ప్లాంట్:

పొడవైన, సన్నని ఆకులతో ఆకర్షణీయంగా కనిపించే స్పైడర్ ప్లాంట్‌ను కూడా నీటిలో పెంచుకోవచ్చు. దీని చిన్న కటింగ్‌ను నీటిలో ఉంచితే వేర్లు పెరగడం ప్రారంభిస్తాయి. పారదర్శకమైన గ్లాస్ లేదా చిన్న జార్‌లో దీనిని ఉంచితే ఇంటి అలంకరణకు కూడా ఉపయోగపడుతుంది. ఎక్కువ స్థలం లేని వారికి కిటికీ పక్కన, చిన్న షెల్ఫ్ లేదా టేబుల్‌పై ఉంచుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

లక్కీ బ్యాంబూ:

నీటిలో సులభంగా పెంచుకోగల మొక్కల్లో లక్కీ బ్యాంబూ ముందుంటుంది. దీనిని మట్టి లేకుండా బయటకు కనపడేలా ఓ గాజు కంటైనర్‌లో నీటితో పెంచుకోవచ్చు. దీని పొడవైన ఆకుపచ్చ కాండాలు ఇంటికి చక్కని, క్లీన్ లుక్‌ను అందిస్తాయి. లక్కీ బ్యాంబూను నేరుగా ఎండపడని ప్రదేశంలో ఉంచడం మంచిది. అలాగే నీటిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. దీనివల్ల వేర్ల చుట్టూ మురికి పేరుకుపోకుండా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.

స్నేక్ ప్లాంట్:

సాధారణంగా స్నేక్ ప్లాంట్‌ను మట్టి ఉన్న కుండీల్లోనే చూస్తుంటాం. అయితే దీని ఆరోగ్యకరమైన ఆకుల కటింగ్‌ను నీటిలో ఉంచి వేర్లు పెంచుకోవచ్చు. మందంగా, నిటారుగా ఉండే దీని ఆకులు ఇంటికి ఆధునిక లుక్‌ను ఇస్తాయి. ఇంట్లో ఇప్పటికే స్నేక్ ప్లాంట్ ఉంటే ఆరోగ్యంగా ఉన్న కటింగ్‌ను తీసుకుని నీటిలో పెంచవచ్చు. అయితే కటింగ్‌ను ఉంచే నీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఎగ్లోనెమా:

ఎగ్లోనెమా లేదా చైనీస్ ఎవర్‌గ్రీన్ పచ్చని, ఆకర్షణీయమైన ఆకులకు ప్రసిద్ధి చెందింది. దీని కటింగ్ ద్వారా నీటిలో వేర్లు పెంచుకోవచ్చు. ఇది గుబురుగా కనిపించడం వల్ల ఇంట్లో వెంటనే పచ్చదనం కనిపించేలా చేస్తుంది. ఎగ్లోనెమాను శుభ్రమైన నీటిలో ఉంచడంతో పాటు తగినంత వెలుతురు ఉండే ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అయితే నేరుగా పడే తీవ్రమైన ఎండలో మాత్రం ఉంచకపోవడం మంచిది.

సింగోనియం:

బాణం ఆకారంలో ఉండే ఆకులతో సులభంగా గుర్తించగలిగే మొక్క సింగోనియం. దీని కటింగ్‌ను నీటిలో ఉంచితే వేర్లు పెరగడం ప్రారంభమవుతుంది. పారదర్శకమైన చిన్న జార్ లేదా బాటిల్‌లో పెంచితే వేర్లు కూడా కనిపిస్తూ అందంగా ఉంటాయి. దీనిని ఆఫీస్ డెస్క్, కిచెన్ కిటికీ లేదా చిన్న షెల్ఫ్‌పై ఉంచుకోవచ్చు. తక్కువ స్థలంలోనే ఇంటికి సహజమైన పచ్చదనాన్ని తీసుకురావడానికి ఇది బెస్ట్.

పెంచేటప్పుడు జాగ్రత్తలు:

నీటిలో మొక్కలు పెంచడం సులభమే అయినప్పటికీ.. వాటికి సంరక్షణ అవసరం ఉండదని అనుకోవద్దు. ముందుగా ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని ఉపయోగించాలి. నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. నీటి నుంచి దుర్వాసన వస్తే వెంటనే కంటైనర్‌ను శుభ్రం చేసి కొత్త నీటిని పోయాలి. అలాగే మొక్కలను నేరుగా తీవ్రమైన ఎండలో ఉంచకుండా, వాటి అవసరానికి అనుగుణంగా తగినంత కాస్త తక్కువ వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచడం మంచిది. ప్రతి మొక్క అవసరాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి దాని పెరుగుదలను గమనిస్తూ సంరక్షణ అందించాలి.