Reading Time: 2 minutes

IPL 2026: ఢిల్లీ కోటలో ఆర్‌సీబీ రచ్చ.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం

Caption of Image.

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను (DC) 9 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఆర్‌సీబీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం నుంచే వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. యువ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30 పరుగులు) ఒక్కడే పోరాటం చేసినా, మిగిలిన వారు చేతులెత్తేయడంతో ఢిల్లీ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆర్‌సీబీ ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది.

బెథెల్ మెరుపులు.. పడిక్కల్ విధ్వంసం: 
76 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్‌సీబీ ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. యంగ్ ఓపెనర్ జాకబ్ బెథెల్ (20) రెండు భారీ సిక్సర్లు, ఒక ఫోర్ బాది జోరు ప్రదర్శించాడు. అయితే కైల్ జేమీసన్ బౌలింగ్‌లో నటరాజన్‌కు క్యాచ్ ఇచ్చి బెథెల్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ ఢిల్లీ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. కేవలం 13 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 34 పరుగులు చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు.

కింగ్ కోహ్లీ ఫినిషింగ్: 
ఒకవైపు పడిక్కల్ దంచుతుంటే, మరోవైపు కింగ్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా, పవర్ ప్లే ముగిసిన వెంటనే తన బ్యాటింగ్ గేర్ మార్చాడు. వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను స్టైలిష్‌గా ముగించాడు. ఈ విజయంతో ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవడమే కాకుండా, తమ నెట్ రన్ రేట్‌ను కూడా +1.919గా మెరుగుపరుచుకుంది. మరోవైపు, 76 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకోవడంలో ఢిల్లీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కైల్ జేమీసన్ ఒక్కడే ఒక వికెట్ తీయగా, మిగిలిన బౌలర్లు ఆర్‌సీబీ బ్యాటర్ల దాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఘోర ఓటమితో ఢిల్లీ జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. 

 

©️ VIL Media Pvt Ltd.