
మానవత్వం మంటగలిసిందా?.. రోజురోజుకు మానవ విలువలు నశించిపోతున్నాయా?.. మనిషికి, మనిషికి మధ్య బంధాలు తెగిపోతున్నాయా..? ఆపదలో ఉంటే ఆదుకోవాల్సిన మనిషి .. సాయం కోరిన సాటి మనిషిని హేళనగా, చులకనగా, స్వార్థ బుద్దితో చూస్తున్నాడా.. ? అంటే ఈ ఘటన చూస్తే నిజమే అనిపిస్తోంది..
భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.. వైద్యం చేసి కాపాడండి అని ఆస్పత్రికి వస్తే.. పెట్టెడు దుఖంలో ఉన్న ఆ మహిళచేత ఆస్పత్రి సిబ్బంది వెట్టి చాకిరి చేయించిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. మానవత్వం రోజురోజుకు మంటగలిచిపోతుందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ..సాటి మనిషికి సాయం చేయడంలో కూడా స్వార్థం చూసుకుంటున్న రోజులివి..ఆపదలో ఉన్నాం..సాయం కోరితే తోటి మనిషిని చులకన చూసే కాలం ఇది. చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న భర్తను చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. భార్య చేత గొడ్డు చాకిరి చేయించారు ఆస్పత్రి సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వీళ్లు మనుషులేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లోని కట్ని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను రక్షించుకునేందుకు ఆస్పత్రికి తీసుకొచ్చింది ఓ మహిళ. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను దగ్గరుండి చూసుకోవాల్సిన సమయంలో మానవత్వం లేని ఆస్పత్రి సిబ్బంది ఆమెచేత అడ్డమైన పనులు చేయించారు. ట్రీట్ మెంట్ చేస్తాం గానీ.. మేం చెప్పిన పని చేయాలంటూ ఆర్డర్ వేశారు. దీంతో చేసేదేమీ లేక భర్తను కాపాడుకునేందుకు వారు చెప్పిన పని చేసింది. ఆస్పత్రి శుభ్రం చేసింది..అంబులెన్స్ కూడా కడిగి శుభ్రం చేసింది. చివరికి టాయిలెట్స్ శుభ్రం చేసింది.ఆమె అంబులెన్స్ ను క్లీన్ చేస్తున్న దృశ్యాలను అక్కడున్న కొందరు సెల్ ఫోన్ బంధించి సోషల్ మీడియా షేర్ చేశారు.
వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. మానవత్తం మంటగలిపి ఇలాంటి నీచానికి దిగజారిన ఆస్పత్రి సిబ్బందిపై ఓ రేంజ్ లో బూతులు తిడుతూ రిప్లైలు షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఆస్పత్రి సిబ్బందిని, అంబులెన్స్ డ్రైవర్ ను వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక కొందరైతే మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి.. అక్కడి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రిప్లై ఇచ్చారు. ఏదీ ఏమైనా సాటి మనిషికి ఆపద వస్తే ఆదుకోవాల్సిన టైంలో.. అందులో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇలా నీచమైన పనులు చేయించి బాధితులను మరింత బాధపెట్టడం మంచిది కాదని సలహాలిస్తున్నారు నెటిజన్లు.