Reading Time: 2 minutes

ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి ఆర్‌టిసి జెఎసి పిలుపు నిచ్చింది. కార్మిక సంఘాల జెఎసి అత్యవసర సమావేశం సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జెఎసి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్‌టిసిలో గత 7 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆర్‌టిసి జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయపడింది. ఒకపక్కన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్‌టిసి స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతూ, మరోపక్క రీ ఆర్గనేజషన్ యాక్ట్ 2014 కు తూట్లు పొడుస్తూ బస్ భవన్ లో సగభాగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నం చేయడంపై జాయింట్ యాక్షన్ కమిటీ నిప్పులు కక్కింది. ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ జోనలో ఉన్న కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే మరోప్రక్క మల్టీ ట్రేడ్ సిస్టమ్ ని తీసుకువచ్చి ఆర్‌టిసి కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని జాయింట్ యాక్షన్ కమిటి ప్రభుత్వం, యాజమాన్యాలపై విరుచుకుపడింది. జాయిoట్ యాక్షన్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన కారణంగా లేని సమస్యలను కార్మికుల ముందుకు తీసుకువచ్చి,

కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ప్రభుత్వం, యాజమాన్యాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించింది. వారు ఆడుతున్న మైండ్ గేమ్ ని కార్మికవర్గం తిప్పికొట్టి గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొంది. కార్మికుల హక్కులను హరించటానికి ప్రభుత్వ, యాజమాన్యాలు చీకటి బోనులో సింహాల్లా ఎదురు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమ్మె నోటీసులో ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయట, ట్రేడ్ యూనియన్లను రిస్టోర్ చేయడం, వేతన సవరణలు జరపడం, తదితర సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెలోకి వెళ్ళటం ఖాయమని జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి అన్నారు. కార్మికుల ఆవేదనను ‘కార్మిక గర్జన‘ రూపంలో వినిపిస్తామని హెచ్చరించారు .ఇప్పటికైనా లేబర్ కమిషనర్ కన్సిలేషన్ ప్రక్రియ ప్రారంభించి జాయింట్ యాక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించాలని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని జెఎసి నాయకత్వం మరొక లేఖ ద్వారా జాయింట్ లేబర్ కమిషనర్ సునీత గోపాల్ దాస్‌ను కోరింది.

ఆర్‌టిసి జెఎసి పిలుపు మేరకు ఈ నెల 7న మంగళవారం చేపట్టనున్న బస్‌భవన్ బచావో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆర్‌టిసి జెఎసి ప్రకటించింది. సోమవారం కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఆర్‌టిసి ఉమ్మడి ఆస్తి అయిన బస్ భవన్ లోని ఎపికి చెందిన ఎ బ్లాక్ ను జిఎస్‌టి, ఇన్కమ్ టాక్స్ వారికి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం, జెఎసి ఏప్రిల్ 7న బస్ భవన్ బచావో కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఎ బ్లాక్ మొత్తం ఎపి సిబ్బంది స్వాధీనం చేసుకొని అన్ని ఫ్లోర్లకు తాళాలు వేసుకుని సీల్ చేశారు. ఇదంతా కార్మికుల ఉద్యమ సెగతో అక్కడ ఎపి ప్రభుత్వం అప్రమత్తం కావడంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎ బ్లాక్ ను తిరిగి ఆర్‌టిసి సంస్థ స్వాధీనం చేసుకోవడం కార్మిక విజయంగా భావిస్తూ మంగళవారం తలపెట్టిన బస్ భవన్ బచావో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జెఎసి నేతలు ఈదురు వెంకన్న , ఎం. థామస్ రెడి. ఎండి మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి తెలిపారు.