Reading Time: < 1 minute
Minister Kishan Reddy National Handloom Day Schemes Weavers

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలుపుతూ కీలక ప్రకటన చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత, వస్త్ర పరిశ్రమ అత్యంత కీలకమైన భాగమని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం తర్వాత దేశంలో దాదాపు 5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం ఇదేనని, ఇది దేశానికి గణనీయమైన విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తోందని చెప్పారు.

ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు 5F విజన్ (ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారిన్) అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచ వస్త్రకేంద్రంగా మార్చే లక్ష్యంతో 2030 నాటికి ఎగుమతులను రూ.9 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు.

పీఎల్ఐ (PLI) పథకం, పీఎం మిత్ర పార్కులు, నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, రా మెటీరియల్ సప్లయ్ స్కీమ్, వీవర్స్ ముద్రా స్కీమ్ ద్వారా నేత కార్మికులకు ఆధునిక మగ్గాలు, ముడిసరుకు, రుణాలు, మార్కెటింగ్ సౌకర్యాలు మరియు సామాజిక భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలోని వరంగల్‌లో పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, పత్తి రైతుల నుంచి మద్దతు ధర (MSP) కింద కేంద్రం రూ.69,860 కోట్లకు పైగా ఖర్చు చేసిందని చెప్పారు. చేనేత రంగానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతను అనుసంధానిస్తూ ఉత్పాదకత, నాణ్యతను పెంచుతున్నామని పేర్కొన్నారు. సంప్రదాయ కళను కాపాడుతూ నేతన్నలను ఆదుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి ప్రోత్సహించాలని కోరారు.