Reading Time: < 1 minute
Perni Nani Sensational Comments On Ap Capital

Perni Nani: అమరావతి రాజధానిపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ జగన్‌ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్‌’గా తీర్మానం చేశారన్న ఆయన.. అమరావతి, విజయవాడ, గుంటూరు కలిసి రాజధానిగా తీర్మానం చేశారు.. త్వరలో కేబినెట్‌లో తీర్మానం పెట్టనున్నారంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు.. ఇక, డీఎస్సీ అంశంపై ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. విజయవాడలో నిరసనకారులపై దాడులు చేయడమే కాకుండా, దీక్షా శిబిరంపై కూడా దాడి జరిగిందని పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని, మల్లాది విష్ణుపై దాడి జరిగిన తర్వాత కూడా బాధితుడినే పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారని విమర్శించారు.

డీఎస్సీలో జరిగిన అవకతవకలపై పోరాటం చేయడం తప్పా అని ప్రశ్నించిన పేర్ని నాని, అధికార పార్టీ నేతల చర్యలు ప్రభుత్వ ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం విగ్రహాన్ని తయారు చేయించి ఎందుకు ఏర్పాటు చేయలేదని, వంగవీటి రంగా విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదని ప్రశ్నించారు. ఇక, అమరావతి పరిధిలో విజయవాడ, గుంటూరును కలుపుతూ కేబినెట్‌లో తీర్మానం తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వ్యాఖ్యానించారు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దాడులు, బెదిరింపులతో ప్రతిపక్షం గొంతును అణచివేయలేరని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు మాజీ మంత్రి పేర్నినాని..

కాగా, అమరావతి రాజధానిగా కాకుండా.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు(మావిగన్) లను కలిపి రాజధాని కారిడార్‌గా అభివృద్ది చేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన విషయం విదితమే.. దీనివల్ల లక్షల కోట్ల ప్రజాధనం వెచ్చించవలసిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో మావిగన్ కు ఆమోదం తెలిపేవారు వైఎస్సార్‌సీపీకి, అమరావతికి అంగీకారం తెలియచేసేవారు కూటమికి ఓటు వేయవచ్చని, ఇది ఎన్నికల అంశంగా తీసుకుంటామని కూడా వైఎస్‌ జగన్‌ సవాల్‌ విసిరిన విషయం విదితమే..