
ఏపీ అన్నమయ్య జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలింది. ఇంట్లో ఉన్న రిఫ్రిజిరేటర్ పేలిన ప్రమాదంలో అక్కా, తమ్ముడు సహా.. నలుగురు గాయపడ్డారు. తీవ్రగాయాల పాలైన వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు.. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. తంబళ్లపల్లి మండలం గోపిదిన్నెలో ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. గోపిదిన్నె ఎస్సీ కాలనీలో ఉంటున్న శివ కుమార్ ఇంట్లో అర్ధరాత్రి నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించారు. గ్యాస్ లీక్ అవుతుందేమోనన్న అనుమానంతో ముందుగా గ్యాస్ సిలిండర్ ను చూసారు. సిలిండర్ నుంచి కాదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి దుర్వాసన రావడం గమనించారు. రిఫ్రిజిరేటర్ నుంచి వాసన వస్తుందని పరిశీలించారు. ఈ క్రమంలోనే.. ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేశారు.. అది ఓపెన్ చేయడంతోనే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
రిఫ్రిజిరేటర్ పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం అయ్యింది. ఇంట్లోని వస్తువులు చల్లాచెదురు అయ్యాయి.. ఇంట్లో ఉన్న శివ కుమార్, మరదలు పవిత్రతోపాటు ఆమె తమ్ముడు ప్రకాష్ లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ పవిత్ర, ప్రకాష్ లను కాపాడే క్రమంలో శివ కుమార్ తో పాటు అతని భార్య సుస్మిత కూడా స్వల్పంగా గాయ పడ్డారు. గాయపడ్డ నలుగురిని స్థానికులు తంబళ్లపల్లి ఆసుపత్రికి తరలించారు. పవిత్ర, ప్రకాష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఫ్రిజ్ ఎందుకు పేలిందన్న విషయం తెలియాల్సి ఉంది.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.