Reading Time: < 1 minute
Raka Movie Update Is Deepika Padukones Shooting Nearly Complete

Deepika Padukone Raka Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘రాకా’. ఈ మూవీపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో బన్నీతో పాటు దీపికా కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

అయితే దీపికా పదుకొనే వ్యక్తిగత కారణాల నేపథ్యంలో షూటింగ్‌కు కొంతకాలం విరామం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుత రాకా ముంబై షెడ్యూలే ఆమె పాల్గొనే చివరి షెడ్యూల్‌ అని చర్చ జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత దీపికాకు సంబంధించిన షూటింగ్ పోర్షన్ దాదాపు పూర్తయ్యే అవకాశం ఉందని టాక్. ముంబై షెడ్యూల్‌లోనే దీపికాపని పూర్తవనుందట. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిత్రీకరణ ఇంకా భారీగా మిగిలి ఉన్నట్లు సమాచారం. 100 రోజులకు పైగా షూటింగ్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.

భారీ హంగులతో, అత్యున్నత సాంకేతిక విలువలతో రాకా సినిమాను రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన సన్నివేశాలకు ఎక్కువ సమయం అవసరమవుతుండటంతో.. షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయడం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నారట. రాకాలో దీపికాతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే ‘రాకా’కు సంబంధించిన పూర్తి స్టార్ క్యాస్టింగ్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాతే సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.