Reading Time: 3 minutes
Story Board About Tamil Nadu Politics From Karunanidhi And Jayalalithaa To Vijay A History Of Political Rivalry And Arrests

Story Board: దేశపు దక్షిణ కొసన ఉన్న రాష్ట్రం తమిళనాడు. ఇక్కడ అరవై ఏళ్లుగా ద్రవిడ సిద్ధాంతమే ఆలంబనగా రెండే పార్టీలు చక్రం తిప్పుతూ వచ్చాయి. అన్నాదురై శిష్యులుగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కరుణానిధి, ఎంజీఆర్.. చివరకు అభిప్రాయభేదాలతో రాజకీయంగా వేర్వేరు దారులు ఎంచుకున్నారు. కరుణానిధి డీఎంకేలో కొనసాగగా.. ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఎంజీఆర్ ఉన్నంతవరకు అధికారానికి దూరమైన కరుణానిధి.. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత తీసుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్నుంచీ జయలలిత, కరుణానిధి మధ్య రాజకీయ వైరానికి మించి.. వ్యక్తిగత పగ, ప్రతీకారం, పంతం పెద్దపీట వేసుకుని కూర్చున్నాయి. ఈ కారణంగానే మూడు దశాబ్దాల క్రితమే తమిళనాడులో ప్రతీకారాలు, ప్రతిపక్ష నేతల అరెస్ట్‌కు బీజం పడింది. అది అలాగే కొనసాగి.. ఇప్పుడు విజయ్ రూపంలో కొత్త రాజకీయ శక్తి వచ్చాక కూడా.. ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి అరెస్ట్‌కు దారితీసిందనే చర్చ జరుగుతోంది.

1996లో తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితను సీఎంగా ఉన్న కరుణానిధి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో, జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు వి.కె. శశికళను కూడా అరెస్ట్ చేసి సుమారు నెల రోజుల పాటు జైలులో ఉంచారు. పోయెస్ గార్డెన్‌లోని జయ నివాసంలో జరిపిన సోదాల్లో భారీ ఎత్తున బంగారు ఆభరణాలు, వేల సంఖ్యలో పట్టుచీరలు, వందలాది చెప్పుల జతలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఈ అవమానానికి ప్రతీకారంగానే, తిరిగి 2001లో అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత అర్ధరాత్రి పూట కరుణానిధిని అత్యంత నాటకీయంగా అరెస్ట్ చేయించారు. దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత సంచలనాత్మకమైన సంఘటనలలో ఇది ఒకటిగా నిలిచింది. కరుణ అరెస్ట్‌కు ప్రధాన కారణం ఫ్లైఓవర్ల కుంభకోణం. చెన్నైలో రూ. 115.50 కోట్ల వ్యయంతో చేపట్టిన 10 ఫ్లైఓవర్ల నిర్మాణంలో రూ. 12 కోట్ల మేర అవినీతి మరియు అధికార దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జె.సి.టి. ఆచార్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కరుణానిధిని అరెస్ట్ చేశారు. పోలీసులు చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలోకి చొరబడ్డారు. 78 ఏళ్ల వృద్ధుడైన కరుణానిధిని కనీసం బట్టలు మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా, మంచంపై నుండి బలవంతంగా ఈడ్చుకెళ్లారు.కరుణానిధిని రక్షించేందుకు ప్రయత్నించిన అప్పటి కేంద్ర మంత్రులు మురసోలి మారన్, టి.ఆర్. బాలులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో విధుల్లో ఉన్న కేంద్ర క్యాబినెట్ మంత్రులను అరెస్ట్ చేయడం ఇదే మొదటిసారి.

కరుణానిధిని అరెస్ట్ చేసిన విధానంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ఒత్తిడి పెరగడంతో, జయలలిత ప్రభుత్వం జూలై 4న మానవీయ కోణంలో కరుణానిధిని విడుదల చేసింది.1996లో జయలలితను కరుణానిధి ప్రభుత్వం అరెస్ట్ చేయించినందుకు ప్రతీకారంగానే, జయలలిత తిరిగి అధికారంలోకి రాగానే ఈ అర్థరాత్రి అరెస్ట్ ప్లాన్ చేశారనేది బహిరంగ రహస్యం. ఆ తర్వాత 2006లో డీఎంకే తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ కేసును పూర్తిగా పక్కనబెట్టేశారు. ఇక్కడ జయలలిత, కరుణానిధి ఇద్దరూ రాజకీయాల్లో హేమాహేమీలే. కంటి చూపుతో తమ తమ పార్టీలను శాసించినవారే. వ్యక్తిగతంగా నేతలిద్దరికీ ఫాలోయింగ్‌కూ కొదువలేదు. సాధారణంగా ఎవర్నీ లెక్కచేయని మనస్తత్వం ఉన్న ఈ ఇద్దరు నేతలూ. ప్రతీకారం విషయంలో మాత్రం ఒకేలా ఆలోచించడం యాదృచ్ఛికం కానే కాదు. ఇద్దరూ వ్యూహాత్మకంగా, ప్రత్యర్థిని మానసికంగా దెబ్బకొట్టి.. ప్రతిపక్షాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో పన్నిన వ్యూహం.. తమిళ రాజకీయాల్లో ఒక దురదృష్టకర సంప్రదాయానికి పునాది వేసిందనే చెప్పాలి. ఈ ఇద్దరు నేతలు మొదలుపెట్టిన సంప్రదాయం వారు దివంగతులైన తర్వాత కూడా యథాతథంగా కొనసాగుతుండటం.. తమిళనాడుతో పాటు మొత్తంగా దేశ ప్రజల్ని ఆశ్చర్యపరుస్తోంది.

తొలి నుంచీ కరుణానిధి కుటుంబం డీఎంకేను నడిపిస్తుండటంతో.. జయలలిత తన ప్రతీకారాన్ని కరుణానిధితో వదిలిపెట్టలేదు. కరుణ అరెస్ట్ జరిగిన దశాబ్దం తర్వాత ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కూడా అరెస్ట్ చేయించారు. ఈసారి డీఎంకే శ్రేణులతో కలిసి ధర్నాకు దిగిన స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం హయాంలో డీఎంకే నేతలపై వరుసగా భూకబ్జా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, దానికి నిరసనగా డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈ ప్రదర్శనలో వేల మంది కార్యకర్తలు పాల్గొనడంతో, అనుమతి లేదనే కారణంతో పోలీసులు స్టాలిన్‌తో పాటు పలువురు పార్టీ నాయకులను అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత విడిచిపెట్టారు. అదే ఏడాది డిసెంబర్ 2011లో కూడా ఆయనపై మరో భూకబ్జా కేసు నమోదు కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

ఇక్కడ జయలలిత, కరుణానిధి మాజీ ముఖ్యమంత్రుల హోదాలో అరెస్ట్ అయితే.. ఎంకే స్టాలిన్ మాత్రం మాజీ డిప్యూటీ సీఎం హోదాలో అరెస్ట్ అయ్యారు. అయితే అరెస్టైన సమయంలో ఆయా నేతలు.. తమ పార్టీల తరపున ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా సూటిగా చెప్పాలంటే అప్పటి ప్రభుత్వాల్ని ఇరుకున పెడుతున్నారు. దీంతో కొడితే ఏనుగు కుంభస్థలం మీద కొట్టాలనే ఉద్దేశంతో.. ప్రతిపక్ష నేతల్నే అరెస్ట్ చేయడం ద్వారా.. నిరసనల్ని సహించేది లేదనే కఠిన సంకేతం పంపటమే లక్ష్యంగా ఆయా సందర్భాల్లో తమిళ నేతలు వ్యవహరించారు.

జయలలిత అరెస్ట్ అయినప్పుడు వింతగా చెప్పుకున్న రాజకీయ వర్గాలు.. కరుణానిధి అరెస్ట్ జరిగినప్పుడు.. అది రాజకీయ ప్రతీకారమేననే నిర్ధారణకు వచ్చేశాయి. ఇక ఎంకే స్టాలిన్ అరెస్ట్ అయితే.. తమిళనాడులో మామూలేగా అని సరిపెట్టుకున్న దాఖలాలున్నాయి. ఆ స్థాయిలో తమిళనేతలు ప్రతీకారాన్ని తమ రాజకీయ వ్యూహంలో భాగం చేసి.. ఆ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దని మిగతా దేశానికి అలవాటు చేశారు. తమిళనాడులో ఏం జరిగినా రాజకీయమేనని.. ద్రవిడ సిద్ధాంతం పునాది మీదే రెండు పార్టీలూ ఏర్పడటంతో కూడా.. పంతాలు, ప్రతీకారాలకు ఫ్రంట్‌ సీట్ దక్కిందనే చర్చ కూడా లేకపోలేదు. ఏదేమైనా తమిళ తంబీలు మాత్రం దశాబ్దాలుగా ప్రతిపక్ష నేతల అరెస్ట్‌లు చూస్తూనే ఉన్నారు. అరెస్ట్‌కు ఏ కారణాలు చెప్పినా.. అసలు కారణం తమకు తెలుసులే అని సరిపెట్టుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. డీఎంకే, అన్నాడీఎంకే క్యాడర్‌ కూడా తమ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు.. ప్రత్యర్థి పార్టీ నేతల్ని అరెస్ట్ చేయాలని కోరుకున్న మాట కూడా వాస్తవం. తమిళ సమాజం రెండు పార్టీల మధ్య చీలిపోవడంతో.. మెజార్టీ జనాభా ఈ అరెస్టుల్ని ఫక్తు రాజకీయంగానే చూసే దృష్టి కోణం అలవడింది. పైగా అరెస్ట్‌లపై తాత్కాలిక చర్చలే కానీ.. అంతకు మించి ఆలోచించటానికి ఇష్టపడకపోవడమే తమిళనాడులో అసలు సిసలు రాజకీయం. కాకపోతే ప్రతిసారీ అరెస్ట్ జరిగినప్పుడల్లా.. గత చరిత్రను తవ్వటం మాత్రం షరా మామూలైపోయింది.