Reading Time: 2 minutes
Jayam Ravi To Play Lord Venkateswara In Manchu Manojs Film Vaddi Kasula Vaadu

Vaddi Kasula Vaadu: కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్, ఇప్పుడు పూర్తి వినోదాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న ‘వడ్డీ కాసుల వాడ’ ఇప్పటికే వినూత్నమైన టైటిల్, మధ్యతరగతి కుటుంబ నేపథ్యంతో ఆసక్తిని పెంచుతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ మూవీలో తమిళ స్టార్ హీరో జయం రవి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో జయం రవి శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే, ఇది తెలుగు, తమిళ సినీ అభిమానులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. ఇందులో కథానాయకుడికి శ్రీ వెంకటేశ్వర స్వామికి మధ్య జరిగే సన్నివేశాలు వినోదాత్మకంగా సాగనున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ అంశమే సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

‘వడ్డీ కాసుల వాడ’ను దర్శకుడు తేజ్ ఉప్పలపాటి తెరకెక్కిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే వెల్లడించింది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికపాటి, అజయ్ సుంకర, దయా పన్నెం సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ‘బిందాస్’ చిత్రంతో పాజిటివ్ టాక్ అందుకున్న మంచు మనోజ్, చాలా గ్యాప్ తర్వాత మరోసారి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పనిచేయడం కూడా ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది.

మంచు మనోజ్ కెరీర్‌లో ఈ సినిమా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినోదంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జయం రవి నిజంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటిస్తారా లేదా అనే విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. అధికారిక ప్రకటన వస్తే ఈ కలయిక తెలుగు సినీ ప్రేక్షకులకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం కనిపిస్తోంది. అయితే వేంకటేశ్వర స్వామి అనగానే మనకు ‘అన్నమయ్య’లో నటుడు సుమన్ ఎక్కువగా గుర్తుకు వస్తాడు. అంతలా ఆడియన్స్ లో గుర్తుండిపోయింది ఆ పాత్ర. మరి జయం రవి ఇప్పుడు వేంకటేశ్వర స్వామి పాత్రలో ప్రజలను ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలి.