Reading Time: 2 minutes
Kjq Telugu Movie Review Dheekshith Shetty Sashi Odelas Gangster Drama

KJQ Movie Review: దసరా, గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దీక్షిత్ శెట్టి, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తమ్ముడు శశి ఓదెల ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ‘కె.జె.క్యు’ (కింగ్, జాకీ, క్వీన్ అనేది ట్యాగ్ లైన్). ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ పాత్రలో నటించింది. గతంలో నాగార్జునతో ‘కేడి’ అనే సినిమా చేసిన దర్శకుడు కిరణ్ (కేకే) ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే సినిమా రిలీజ్ కాకముందే ఆయన అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. అయినా సరే, ఈ సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కిరణ్ చనిపోయాక కూడా కొంతవరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయించి, ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కె.జె.క్యు కథ:
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న పార్థ (దీక్షిత్ శెట్టి) ఓ అనాధ. అతన్ని చేరదీసిన చిచ్చా (మురళీధర్ గౌడ్) అతనిని ఒక పెద్ద డాన్‌గా తీర్చిదిద్దుతాడు. అలానే అనాధ అయిన జాకీ (శశి ఓదెల) పార్థకి దగ్గరవుతాడు. వీరిద్దరూ కలిసి స్కెచ్ వేస్తే ఎంతటి మనిషినైనా లేపేయడమే. అలా తక్కువ కాలంలోనే ఈ గ్యాంగ్ హైదరాబాద్ మొత్తం మీద పెత్తనం చెలాయించే స్థాయికి వెళుతుంది. ఈ క్రమంలో పార్థ హీరోయిన్ భార్గవి (యుక్తి తరేజా) మీద మనసు పడతాడు. కానీ హీరోయిన్ మాత్రం అతన్ని ప్రేమించడానికి ఒప్పుకోదు. ఈ క్రమంలో పార్థ ఆమెను చంపేందుకు సైతం సిద్ధపడతాడు. అయితే ఆమెను చంపడానికి వెళ్లిన జాకీ ఆమెను చంపాడా లేదా? చివరికి ఏం జరిగింది? ఆ హీరోయిన్ అసలు ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ
ఇద్దరు స్నేహితులు, ఓ అమ్మాయి, ఆ అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు పోటీ పడటం, వారు బద్ధ శత్రువులుగా మారడం లాంటి లైన్‌తో ఇప్పటికే మనం తెలుగులో పదుల సంఖ్యలో సినిమాలు చూసేసి ఉన్నాము. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత దాదాపుగా అదే ఫీల్ కలుగుతుంది. కానీ సినిమా ప్రారంభమయ్యాక ‘అదేంటి, మన ఊహకు అందని విధంగా లేదేంటి?’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే సాదాసీదా గ్యాంగ్స్టర్ డ్రామాలాగా ఇది కూడా సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ భార్గవిగా యుక్తి తరేజా ఎంట్రీ ఇస్తుందో, అప్పటినుంచి ‘ఇదేదో మనం అనుకున్న విధంగానే సాగుతుంది’ అనే ఫీలింగ్ కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత కూడా మనం ఊహించిన విధంగా కాకుండా ఒక కొత్త యాంగిల్లో కథను నడిపించాడు దర్శకుడు. అయితే కొత్త యాంగిల్ అన్నాం కదా అని కొత్త కథ అని చెప్పలేము, కాకపోతే ట్రీట్మెంట్ కొంచెం కొత్తగా అనిపించింది.

ఫస్టాఫ్ ఇద్దరు హీరోల పరిచయం, ఆ తర్వాత వారి ఎదుగుదల చుట్టూ తిరుగుతుంది. ఇక ఆ తర్వాత ఒక హీరో సినిమాలో హీరోయిన్ అయిన భార్గవి అనే యువతి మీద మనసు పడటం, ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంతవరకు ఆసక్తికరంగా రాసుకున్నారు. కానీ కథ రొటీన్ గ్యాంగ్స్టర్ డ్రామా అనే ఫీలింగ్ కలిగించడంతో ఎందుకో అంత వర్కౌట్ అయినట్లు అనిపించలేదు.

నటీనటుల విషయానికి వస్తే, దీక్షిత్ శెట్టి ఎప్పటిలాగే తనకు బాగా అలవాటైన తరహా పాత్రలో జీవించేశాడు. స్క్రీన్ మీద బాగున్నాడు, తాను నటించిన పాత్రలో ఆకట్టుకున్నాడు. యుక్తి తరేజా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది. ఇక మురళీధర్ గౌడ్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు.

ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, దర్శకుడిగా కేకే మరోసారి తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే ‘కేడి’ సినిమాలో కొంతవరకు కామెడీ వర్కౌట్ అవ్వగా, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డ్రామా మీదనే ఆయన ఫోకస్ చేశాడు. అది కొంతవరకు రొటీన్ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా, ఇంకా బాగా చేసి ఉంటే సినిమా ఎలివేట్ అయ్యేది అనే ఫీల్ తీసుకువచ్చింది. పాటలు కొంతవరకు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్‌గా ‘కె.జె.క్యు’ ఒక రొటీన్ హైదరాబాదీ గ్యాంగ్స్టర్ డ్రామా.