Reading Time: 2 minutes

ప్రపంచ AI రాజధానిగా భారత్.. కొత్త దారి చూపించిన నందన్ నీలేకణి

Caption of Image.

ఏఐ యుగంలో భారత్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి అన్నారు. అయితే అమెరికా, చైనా తరహాలో అత్యాధునిక చిప్స్ తయారీ, భారీ AI మోడల్స్ అభివృద్ధి పోటీలో భారత్ నేరుగా దిగాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన నీలేకణి.. ప్రపంచం ప్రస్తుతం AI మౌలిక సదుపాయాలైన లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్, చిప్స్, భారీ డేటా సెంటర్లపై దృష్టి పెడుతోందని చెప్పారు. కానీ కాలక్రమేణా ఈ మౌలిక వసతులు సాధారణ సేవలుగా మారిపోతాయని.. అసలు విలువ AI యూజ్ కేస్ లోనే ఉంటుందని వివరించారు.

భారత్‌కు ఉన్న అతిపెద్ద అవకాశం AIని ప్రజల జీవితాల్లో ఉపయోగపడే విధంగా మార్చడంలో ఉందని నీలేకణి చెప్పారు. వ్యవసాయం, వైద్యం, విద్య వంటి రంగాల్లో AIని కోట్లాది మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలదన్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో భారత్ సాధించిన విజయమే AI విస్తరణకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. టెక్నాలజీ కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడేలా చేయడమే భారత్ బలం అని చెప్పారు.

ALSO READ : గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. TCS, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ ఏం చేస్తున్నాయంటే?

భారత్‌లో AI విజయవంతం కావాలంటే అది భారతీయ భాషలను అర్థం చేసుకోవాలని నీలేకణి తెలిపారు. దేశంలోని భాషా వైవిధ్యం, రోజువారీ సంభాషణల్లో ఉపయోగించే మిశ్రమ భాషలను ఏఐ గుర్తించగలగాలని అన్నారు. ఇంగ్లీష్ ఆధారిత ఏఐ కంటే భారతీయ భాషలు, వాయిస్ కమాండ్లను అర్థం చేసుకునే ఏఐ వ్యవస్థలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పారు. ఒక బిలియన్ మందికి ఏఐ సేవలు అందించాలంటే స్థానిక భాషల్లో పనిచేసే సాంకేతికత అవసరమని స్పష్టం చేశారు.

ఏఐ కారణంగా భవిష్యత్తులో పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని నీలేకణి అభిప్రాయపడ్డారు. పెద్ద సంస్థల్లో పనులు ఎక్కువగా క్రమబద్ధంగా ఉండటంతో వాటిని ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయడం సులభమవుతుందని చెప్పారు. దీనికి విరుద్ధంగా చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు ఉద్యోగాల సృష్టిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఒకే కంపెనీ లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. లక్షల చిన్న కంపెనీలు ఒక్కొక్కరికి ఉద్యోగాలు కల్పించే విధానం భవిష్యత్తులో కనిపిస్తుందని చెప్పారు.

గత దశాబ్దంలో భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య 10 వేల కంటే తక్కువ స్థాయి నుంచి దాదాపు లక్షా 50వేలకు పెరిగిందని నీలేకణి తెలిపారు. ఇదే వేగం కొనసాగితే 2035 నాటికి భారత్‌లో 10 లక్షలకు పైగా స్టార్టప్‌లు ఉండే అవకాశం ఉందన్నారు. చిన్న వ్యాపారాలకు లోన్స్, మార్కెట్ అవకాశాలు, AI ఆధారిత సాధనాలు అందుబాటులోకి రావాలని సూచించారు. అకౌంట్ అగ్రిగేటర్ వంటి డిజిటల్ వ్యవస్థలు, ONDC వంటి ప్లాట్‌ఫారమ్‌లు చిన్న సంస్థలకు మరింత బలం ఇస్తాయని చెప్పారు.

భవిష్యత్తులో ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి, గిగ్ వర్క్ నుంచి వ్యాపార రంగానికి మారే పరిస్థితులు పెరుగుతాయని నీలేకణి అన్నారు. అందుకే పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు ఉద్యోగానికి కాకుండా వ్యక్తికి అనుసంధానమై ఉండాలని సూచించారు. AI యుగంలో భారత్ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, విద్య, వైద్యం, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉందని నీలేకణి పేర్కొన్నారు. చిప్స్ తయారీ కంటే ఏఐని ప్రజల సమస్యలకు పరిష్కారంగా మార్చడమే భారత్‌కు అతిపెద్ద అవకాశమని నీలేకణి మాటలు స్పష్టం చేస్తున్నాయి.
 

©️ VIL Media Pvt Ltd.