
ఇంట్లో నేలను ఆరబెట్టడానికి ఫ్యాన్లు పెట్టడం చూస్తుంటాం. కానీ ఓ ఎక్స్‌ప్రెస్‌వేను ఆరబెట్టడానికి ఏకంగా డజన్ల కొద్దీ స్టాండ్ ఫ్యాన్లు పెట్టడం ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రూ.4వేల 200 కోట్ల వ్యయంతో నిర్మించిన లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైన కొద్ది రోజులకే దెబ్బతినడంతో మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్ PNC Infratech, రోడ్డును త్వరగా ఆరబెట్టేందుకు స్టాండ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయటం విమర్శలకు దారితీసింది.
దేశంలోనే తొలి AI ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేగా ప్రచారం పొందిన ఈ రహదారిని జూలై 13న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కొద్ది రోజులకే ఉన్నావో-లక్నో వైపు ఉన్న రహదారిలో సుమారు 300 మీటర్ల మేర దెబ్బతింది. దాన్ని సరిచేయడానికి ముందుగా సబ్‌బేస్‌లో బైండింగ్ మెటీరియల్ వేసి, తర్వాత బిటుమెన్, ఆస్ఫాల్ట్ పరచాల్సి ఉంది. కానీ వరుస వర్షాలతో రోడ్డు పూర్తిగా తడిగా ఉండటం వల్ల పనులు ముందుకు సాగలేదు. దీంతో తేమను తగ్గించి రోడ్డును త్వరగా ఆరబెట్టేందుకు కాంట్రాక్టర్ డజన్ల కొద్దీ స్టాండ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. “హైవేను కూడా ఫ్యాన్లతో ఆరబెడతారా?” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Authorities have deployed 10 fans to dry rainwater accumulated near a patchwork section on the Lucknow. Kanpur Expressway, drawing attention to the unusual approach to clearing waterlogging. pic.twitter.com/7wuXsiSd6W
— TOI Lucknow (@TOILucknow) August 6, 2026
రోడ్డు దెబ్బతినడంతో ప్రస్తుతం ట్రాఫిక్‌ను మళ్లించారు. రెండు వైపులా వెళ్లే వాహనాలను దాదాపు 6 కిలోమీటర్ల మేర ఒకే క్యారేజ్‌వేపై నడిపిస్తున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్‌లు, ప్రయాణంలో తీవ్ర ఆలస్యం ఏర్పడుతోంది. ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన NHAI వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు డెడ్ లైన్ విధించింది. దెబ్బతిన్న మొత్తం హైవేను సొంత ఖర్చుతోనే మరమ్మతు చేయాలని, మరమ్మతులు పూర్తయ్యే వరకు ఎక్స్‌ప్రెస్‌వే వినియోగదారుల నుంచి టోల్ ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే PNC Infratechపై జరిమానా విధించడంతో పాటు, నాన్-పర్ఫార్మింగ్ కంపెనీగా ప్రకటించే ప్రక్రియను కూడా ప్రారంభించింది.
►ALSO READ | యువతకు ఆయన సర్టిఫికెట్ అవసరంలేదు : మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ప్రియాంకాగాంధీ ఫైర్
ఫ్యాన్లతో పాటు టార్పాలిన్ షీట్లు, ఎయిర్ డ్రైయింగ్ మెషీన్లు, హై-ఇంటెన్సిటీ పేవ్‌మెంట్ క్లీనింగ్ పరికరాలు కూడా గత 5 నుంచి 6 రోజులుగా అక్కడ వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వర్షాల కారణంగా తేమ తగ్గకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌వే దెబ్బతినడం, ఆ తర్వాత దాన్ని ఆరబెట్టేందుకు ఫ్యాన్లు పెట్టడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఇది హైవేనా.. లేక ఇంటి ఫ్లోరా?” అంటూ సోషల్ మీడియాలో యూజర్లు కామెంట్స్ పెడుతున్నారు.