Reading Time: < 1 minute

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్ట్‎పై సీఎం చంద్రబాబు స్పెషల్ రివ్యూ

Caption of Image.

అమరావతి: సూక్ష్మ స్థాయి ప్రణాళిక ద్వారా విశాఖ రీజియన్ మొత్తం అభివృద్ధి చేయాలన్నదే వీఈఆర్ (విశాఖ ఎకనామిక్ రీజియన్) ప్రాజెక్టు లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం (ఆగస్ట్ 5) విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు ఆయన పలు సూచనలు చేశారు. 

వివిధ రంగాల్లో కీలకమైన ప్రాజెక్టుల ద్వారా రూ. 9.50 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించేలా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు. రూ. 3.50-4 లక్షల కోట్ల మేర ప్రభుత్వ పెట్టుబడులు.. ప్రైవేట్ రంగం నుంచి రూ. 5.30 లక్షల కోట్లు రాబట్టేలా కార్యాచరణ. బేసిటీ ప్రాజెక్ట్ యాంకర్ ప్రాజెక్టుగా పెట్టుకుని విశాఖ రీజియన్ అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వ ఆలోచన. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వీఈఆర్ పరిధిలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని.. ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించారు. 

ఏఐ డేటా సెంటర్ల ఎకో సిస్టం, పోర్టు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ ఉండాలన్నారు. మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకూ వీఈఆర్ అభివృద్ధిలో భాగంగా ఉండాలన్నారు. వివిధ ప్రాజెక్టులను అనుసంధానించటం ద్వారా విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రగతి సాధించాలని స్పష్టం చేశారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారా వీఈఆర్ పరిధిలో అభివృద్ధి చేపట్టాలని సూచించారు. అవసరమైన మేరకు వీజీఎఫ్ స్కీంను అమలు చేయాలన్నారు.

©️ VIL Media Pvt Ltd.