Reading Time: < 1 minute
Ss Rajamouli Varanasi Mahesh Babu Action Scene Leaked Online

ఎస్.ఎస్. రాజమౌళి – సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఎంత జాగ్రత్త వహిస్తున్నా.. లీకుల బెడద మాత్రం వీడటం లేదు. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్ నుంచి కొన్ని యాక్షన్ సీన్ల వీడియోలు సోషల్ మీడియాలోకి ప్రత్యక్షమై తీవ్ర కలకలం రేపాయి..బుధవారం లీకైన ఈ తాజా క్లిప్పింగ్స్‌లో మహేష్ బాబుకు సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాణ్యత తక్కువగా ఉన్నప్పటికీ, అధికారికంగా ప్రమోషన్లు ప్రారంభించకముందే ఈ కీలక దృశ్యాలు బయటకు రావడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అనేక సామాజిక మాధ్యమాల నుంచి ఈ వీడియోలను తొలగించినప్పటికీ, ఆలోపే అవి అభిమానుల గ్రూపుల్లో వైరల్‌గా మారాయి.
ఇంతటి భద్రతా వ్యవస్థ మరే సినిమాకు ఉండదేమో!

సాధారణంగా వారణాసి సెట్‌లోకి అడుగుపెట్టాలంటే ఐడీ కార్డు తప్పనిసరి. సాంకేతిక నిపుణుల నుంచి నటీనటుల వరకు ఎవరికీ సెల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లే అనుమతి ఉండదు. ప్రొడక్షన్ పరిసర ప్రాంతాల్లోకి మీడియాకు కూడా ప్రవేశం ఉండదు. పైగా నటీనటులు, పనిచేసే సిబ్బందితో కఠినమైన నాన్-డిస్క్లోజర్ అగ్రిమెంట్లపై (NDA) సంతకాలు చేయిస్తారు. టాలీవుడ్‌లోనే కాదు, దేశంలోనే ఇంతటి భద్రతా వలయం మధ్య చిత్రీకరణ జరుపుకునే చిత్రం మరొకటి లేదనడంలో సందేహం లేదు. అయినా సరే, ఏ షెడ్యూల్ జరిగినా ఏదో ఒక దృశ్యం నెట్టింట ప్రత్యక్షమవుతుండటం చిత్రబృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కథ, క్యారెక్టర్ లుక్స్, విజువల్స్ రహస్యంగా ఉంచాలని భావిస్తున్న రాజమౌళి బృందానికి ఈ వరుస లీకులు పెద్ద సవాలుగా మారాయి.