
- మధ్యప్రదేశ్‌లో యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తిలో కృత్రిమ ఫ్లేవర్లు
- ఆర్‌సీ, ఓల్డ్ మాంక్, యాంటిక్విటీలో హానికర రసాయనాలు!
- అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం
- శాంపిల్స్‌ను ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాయల్ చాలెంజ్ (ఆర్‌సీ), ఓల్డ్ మాంక్, యాంటిక్విటీలాంటి ప్రముఖ బ్రాండ్ల మద్యం బాటిళ్ల శాంపిళ్లను తక్షణమే ల్యాబొరేటరీలకు పంపి సమగ్ర తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ( యూఎస్ ఎల్) సంస్థ ఉత్పత్తి చేసే పలు విస్కీ బ్రాండ్లలో అనుమతించదగిన పరిమితికి మించి కృత్రిమ ఫ్లేవర్లు, హానికర రసాయనాలు వాడుతున్నట్టు మధ్యప్రదేశ్‌లోని ఆహార భద్రత ఔషధ పరిపాలన విభాగం నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ, డిస్టిలరీల నుంచి నేరుగా శాంపిళ్లను సేకరించి విశ్లేషించాలని ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో లిక్కర్ సేల్స్‌లో దాదాపు 40 శాతం విక్రయాలతో రాయల్ చాలెంజ్ విస్కీ టాప్‌లో ఉన్నది. ఒకవేళ కల్తీ జరిగితే… లక్షలాది మంది మద్యం వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, డిపోల నుంచి వైన్ షాపుల వరకు ప్రతి బ్యాచ్ మద్యాన్ని కఠినంగా తనిఖీ చేయాలని సర్కార్ భావిస్తోంది. మద్యంలో నాణ్యతా లోపాలు లేదా హానికర రసాయనాలు ఉన్నట్టు తేలితే సదరు కంపెనీ ఉత్పత్తులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతోపాటు ఆయా బ్యాచ్‌లను వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం డిపోలు, వైన్ షాపులలో ఉన్న నిల్వలపై ఎక్సైజ్ నిఘా విభాగాన్ని అలర్ట్ చేశారు.
రాయల్ చాలెంజ్ ఉత్పత్తి విధానం -ఇలా
సాధారణంగా రాయల్ చాలెంజ్ విస్కీని ధాన్యాల (గ్రెయిన్) ఆధారిత న్యూట్రల్ స్పిరిట్‌కు నాణ్యమైన ఇంపోర్టెడ్ స్కాచ్ మాల్ట్‌ను నిర్ణీత నిష్పత్తిలో మిశ్రమం చేసి సహజ సిద్ధమైన ప్రక్రియ ద్వారా తయారుచేస్తుంటారు. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌కు చెందిన ఈ బ్రాండ్‌ను అనుబంధ డిస్టిలరీల ద్వారా సీసాల్లో నింపి బేవరేజెస్ కార్పొరేషన్‌తో విక్రయిస్తారు. రాష్ట్రంలోని మద్యం
మార్కెట్‌లో మీడియం, ప్రీమియం కేటగిరీల విభా గంలో ఆర్‌సీ విస్కీదే అగ్రస్థానంగా ఉంది. నాచారం, మల్కా జ్‌గిరిలో యునైటెడ్ స్పిరిట్స్ ఉత్పత్తి యూనిట్లు ఉన్నా యి. ఇందులో మల్కాజ్గిరి యూనిట్‌ను ఇటీవల మూసివేశారు. అంతటి విస్తృతమైన వినియోగం ఉన్న బ్రాండ్‌పై సంచలన ఆరోపణలు రావడంతో మందుబాబుల్లో కలకలం రేగుతోంది. నాణ్యతా ప్రమాణా లు పాటించకుండా.. స్వల్ప వ్యయంతో రుచి, రంగు పెంచేందుకు చౌకబారు రసాయనాలు కలిపితే వినియోగదారుల లివర్, కిడ్నీలపై నేరుగా దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
మధ్యప్రదేశ్‌లో ఏం జరిగింది?
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్ ప్రాంతాల్లో యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ పంపిన విస్కీ బ్యాచ్‌లను స్థానిక ఎఫ్‌డీఏ అధికారులు ల్యాబ్ పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షల్లో రాయల్ చాలెంజ్‌తో పాటు మరికొన్ని బ్రాండ్లలో ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నిబంధనలకు విరుద్ధంగా కృత్రిమ ఫ్లేవరింగ్ ఏజెంట్లు, పరిమితికి మించిన ఇథనాల్, ఇతర సమ్మేళనాలు కలిపినట్లు నిర్ధారణ అయింది. పారిశ్రామిక స్థాయి స్పిరిట్‌ను బ్లెండింగ్‌లో ఉపయోగించారనే అనుమానాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సదరు ఉత్పత్తుల విక్రయాలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ వార్తలు వెలువడిన వెంటనే అన్ని రాష్ట్రాల ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖలు అప్రమత్తమయ్యాయి. రాష్ట్రంలో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన రాయల్ చాలెంజ్, ఓల్డ్ మాంక్ రమ్, యాంటిక్విటీ విస్కీ బ్యాచ్‌లను వెంటనే ల్యాబ్‌లకు పంపి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని సూచించినట్టు తెలిసింది.