Reading Time: < 1 minute
Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!

దైవ దర్శనానికని వెళ్లి.. ఏకంగా తిరిగిరాని లోకాలకే వెళ్లిన ఘటన టెంపుల్ సిటీ తిరుమలలో చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై ఓ భక్తుడు మృతి చెందగా, మిగతా భక్తులు గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని బన్నేరుఘట్ట రోడ్, గొట్టిగెరెకు చెందిన సాయి శ్రీనివాస్, కుమార్తె సింధు, మనవరాళ్లు తియా, నైరాలతో కలిసి కారులో ఇటీవల శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శుక్రవారం తిరుమల నుంచి కారులో ఇంటికి బయల్దేరారు. వారు ప్రయాణిస్తున్న కారు సరిగ్గా మొదటి ఘాట్‌ రోడ్డులోని 22వ మలుపు వద్దకు రాగానే.. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులోకి జారుకోవడంతో డివైడర్‌ను ఢీకొని అదుపుతప్పి, కారు 15 అడుగుల లోతులో పడిపోయింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలు కావడంతో చికిత్స పొందుతూ సతీష్ కుమార్ (72) ఆస్పత్రిలోనే మృతి చెందారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.