
- గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పట్టించుకోలే
- నైనీ బొగ్గుతో తొలి రైలు రేక్ రావడం చరిత్రాత్మక ఘట్టమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఒడిశా రాష్ట్రంలో సింగరేణి ఆధ్వర్యంలో తవ్వుతున్న నైనీ బొగ్గును రాష్ట్ర అవసరాలకే ఉపయోగిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రెండేండ్ల కృషితో నైనీ బొగ్గు గని నుంచి బొగ్గు రవాణా మొదలైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పట్టించుకోలేదని విమర్శించారు. నైనీ నుంచి 4 వేల టన్నుల బొగ్గుతో రైలు రేక్ గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్ థర్మల్ పవర్ స్టేషన్‌కు చేరుకున్న సందర్భంగా అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి అక్కడి నుంచే సెల్ఫీ వీడియోలో తన సందేశం పంపించారు.
ఇతర రాష్ట్రాలలో తవ్విన బొగ్గు తొలిసారిగా రాష్ట్రానికి తరలిరావడం సింగరేణి సంస్థ చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. రైల్వే రేక్ సుమారు 1,131 కి.మీ దూరం ప్రయాణం పూర్తి చేసి గురువారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) కి చేరుకుందన్నారు. ‘రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతున్నది.
సింగరేణి విస్తరణకు, బలోపేతానికి సీఎం రేవంత్‌తో పాటు యావత్ కేబినెట్ కృషి చేస్తోంది. సింగరేణి సంస్థ పటిష్టత, విస్తరణకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల తాడిచెర్ల-2 బ్లాక్, మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికి దక్కేలా కృషి చేశాం’ అని భట్టి వ్యాఖ్యానించారు. అలాగే, సింగరేణి సంస్థను తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర రాష్ట్రాలు, విదేశాలకు విస్తరిస్తామని ఆ సంస్థ సీఎండీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి తెలిపారు. క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ రంగంలోనూ అడుగుపెడతామన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ మైనింగ్ సంస్థలతో పోటీపడేలా సింగరేణిని అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు.
కేటర్పిల్లర్, కొమట్సు కేంద్రాల పరిశీలన
అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో కలిసి గురువారం టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లో ఉన్న ప్రఖ్యాత మైనింగ్ మిషనరీ తయారీ కేంద్రాలను సందర్శించారు. ఇటీవల సింగరేణికి దక్కిన కొత్త బొగ్గు బ్లాక్‌ల అభివృద్ధి, గనుల్లో కార్మికుల భద్రతే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ముందుగా అరిజోనా రాష్ట్రం టక్సన్‌లోని ‘కేటర్పిల్లర్ డెమాన్‌స్ట్రేషన్ అండ్ లెర్నింగ్ సెంటర్’ను డిప్యూటీ సీఎం భట్టి బృందం సందర్శించింది. అక్కడ అటానమస్ రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే భారీ మైనింగ్ యంత్రాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సమీపంలోని లాంగ్‌వ్యూలో ఉన్న ‘కొమట్సు మైనింగ్ కార్పొరేషన్’ ఫెసిలిటీని కూడా ఉన్నత స్థాయి బృందం సందర్శించింది. అక్కడ భారీ మైనింగ్ యంత్రాల తయారీ, అసెంబుల్ ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు.