
- సగానికి పైగా గృహప్రవేశాలు పూర్తి
- పెట్టుబడి లేనోళ్ల ఇండ్లను ఏజెన్సీలతో నిర్మిస్తున్న అధికారులు
- గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ మూడేండ్లు హామీలతో కాలయాపన
- త్వరలో సీఎం రేవంత్ పర్యటన.. పనులు ముమ్మరం
యాదాద్రి, వెలుగు: ‘వాసాలమర్రిలో ఇండ్లు సక్కదనంగా లేవు.. ఊరంతా కూల్చేసి అందరికీ ఒకేలా కొత్త ఇండ్లు కడదాం.. ఆరు, ఏడు నెలల్లో బ్రహ్మాండంగా మారుస్తాం’… 2021 ఆగస్టు 4న అప్పటి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. కానీ ఆయన హామీలు నీటిమూటలుగానే మిగిలాయి. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామంలో మూడేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు అదే వాసాలమర్రి ఇందిరమ్మ ఇండ్లతో కొత్త రూపు సంతరించుకుంటోంది. మంజూరైన ఇండ్ల నిర్మాణాన్ని అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ దోస్త్ గా చెప్పుకున్న ఆగవ్వ సహా 78 కుటుంబాలు గృహప్రవేశం చేశాయి.
కేసీఆర్ దత్తత.. హామీలకే పరిమితం
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిని 2020 నవంబర్ 1న అప్పటి సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధికి రూ.100 కోట్ల నుంచి రూ.165 కోట్ల వరకు ఖర్చు చేస్తామని, 303 ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ఇంటికో పాడి గేదె ఇస్తామని, గ్రామాన్ని పూర్తిగా మార్చేస్తామని హామీలు ఇచ్చారు.
అయితే దళితబంధు మినహా ప్రకటించిన ప్రధాన హామీలు అమలు కాలేదు. అధికారులు సమావేశాలతో హడావుడి చేసినా ఇండ్ల నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. గ్రామంలోని పాత ఇండ్లను కూల్చివేయకుండా ఉండటమే అప్పట్లో ప్రజలకు మేలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
143 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..
ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక హామీ ఇవ్వకపోయినా వాసాలమర్రి అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇందిరమ్మ తొలి విడతలో ఆలేరు నియోజకవర్గానికి మంజూరైన 3,564 ఇండ్లలో గ్రామానికి ఏకంగా 143 ఇండ్లు కేటాయించారు. వీటిలో 14 మంది లబ్ధిదారులు గ్రామంలో లేకపోగా, మరో 10 మంది ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో నిర్మాణానికి ముందుకు రాలేదు. మిగిలిన ఇండ్లలో 78 కుటుంబాలు ఇప్పటికే గృహప్రవేశం చేశాయి. మిగతా ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
ఏజెన్సీలతో ఇండ్ల నిర్మాణం..
ఇండ్ల నిర్మాణానికి వెనకడుగు వేసిన 20 మంది లబ్ధిదారుల ఇళ్లను అధికారులు మూడు ఏజెన్సీలకు అప్పగించారు. అస్ట్రానిక్ కన్సల్టెన్సీ 10 ఇండ్లను లైట్ వెయిట్ ఇటుకలతో, సాయి మణికంఠ ఇన్‌ఫ్రా ఎనిమిది ఇండ్లను మట్టి ఇటుకలతో, స్కైప్యాక్ ఏజెన్సీ రెండు ఇండ్లను ఆధునిక ‘మై వన్’ టెక్నాలజీతో నిర్మిస్తోంది.
ఇతర పనులు కూడా స్పీడప్..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేసిన పీహెచ్‌సీ, అంగన్‌వాడీ, హైస్కూల్ భవనాల పనులు ప్రస్తుతం వేగం పుంజుకున్నాయి. అంగన్‌వాడీ భవనం పూర్తికాగా, పీహెచ్‌సీ నిర్మాణం చివరి దశలో ఉంది. హైస్కూల్ భవనం పనులు కొనసాగుతున్నాయి.
వాసాలమర్రిని చాలెంజ్‌గా తీసుకున్నం
వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ గ్రామాన్ని అనాథగా వదిలేసిండు. మా ప్రభుత్వం ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చాలెంజ్‌గా తీసుకుంది. అన్ని గ్రామాల కంటే ఎక్కువగా ఇండ్లు మంజూరు చేసినం. మరో 50 ఇండ్లు మంజూరు చేయనున్నాం. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో గృహప్రవేశాలు జరుగుతాయి.
– బీర్ల అయిలయ్య,
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే
త్వరలో సీఎం పర్యటన..
సీఎం రేవంత్‌రెడ్డి త్వరలో వాసాలమర్రిని సందర్శించే అవకాశం ఉంది. ఆ లోపే మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. హౌసింగ్ శాఖ అధికారులను గ్రామంలోనే మోహరించి పనులు వేగవంతం చేశారు. సీఎం సమక్షంలో మరికొంత మంది లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.