Reading Time: < 1 minute

ఇరాన్ యుద్ధంతో 3 నెలల్లోనే రూ.7లక్షల 70వేల కోట్లు సంపాదించిన ఆయిల్ కంపెనీలు

Caption of Image.

ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేయగా.. అదే సమయంలో భారీగా లాభపడిన రంగంగా ఆయిల్ ఇండస్ట్రీ నిలిచింది. యుద్ధ భయాలు, సరఫరా అంతరాయాల ఆందోళనల కారణంగా అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఒక దశలో బ్యారెల్‌కు సుమారు 126 డాలర్లకు చేరింది. ఈ ధరల పెరుగుదల వల్ల పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడులు పెరిగాయి.

అయితే వినియోగదారులు అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్న సమయంలో.. ప్రపంచంలోని అతిపెద్దవైన 6 ఆయిల్ కంపెనీలు భారీ ఆదాయాన్ని నమోదు చేశాయి. నివేదికల ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఈ ఆరు దిగ్గజ సంస్థలు కలిపి ఏకంగా రూ.7లక్షల 70వేల కోట్లు లాభాల రూపంలో ఆర్జించాయి.

యుద్ధ పరిస్థితుల్లో క్రూడ్ సరఫరాపై అనిశ్చితి పెరగడం, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాపై ఆందోళనలు ధరలను పైకి నెట్టాయి. ఈ పరిణామాలు ఇంధన సంస్థలకు భారీ క్యాష్ ఫ్లోను తీసుకువచ్చాయి. 6 ప్రధాన ఆయిల్ కంపెనీలతో పాటు ఇతర ఎనర్జీ సంస్థలు కూడా ధరల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందాయి.

అయితే ఈ భారీ లాభాలపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ కూడా మొదలైంది. ఒకవైపు ఆయిల్ కంపెనీల ఆదాయం రికార్డు స్థాయికి చేరగా, మరోవైపు సాధారణ ప్రజలు పెరిగిన ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, వస్తువుల ధరల భారాన్ని భరించాల్సి వచ్చింది. ఇరాన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచినా.. ఎనర్జీ రంగంలోని దిగ్గజాలకు మాత్రం ఇది భారీ ఆదాయ అవకాశంగా మారటంపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. 
 

©️ VIL Media Pvt Ltd.