
ముస్లిం వివాహాలు, విడాకులకు సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైన, కీలక తీర్పు వెలువరించింది. మతపరమైన సంస్థలు లేదా సెమినరీలు జారీ చేసే ఫత్వా ఆధారంగా ఫ్యామిలీ కోర్టు నుంచి ‘తలాక్ డిక్రీ’ పొందలేమని స్పష్టం చేసింది. భార్య దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను సమర్థించిన కోర్టు.. భర్త దాఖలు చేసిన సివిల్ పిటిషన్‌ను కొట్టేసింది. మధ్యప్రదేశ్ హైకోర్టు జబల్‌పూర్ బెంచ్ ముస్లిం వివాహ చట్టానికి సంబంధించి ఈ కీలకమైన తీర్పును వెలువరించింది. మత సంస్థల ఫత్వా ప్రాతిపదికన కోర్టు ద్వారా తలాక్ పొందలేమని స్పష్టం చేస్తూనే, ముస్లిం పురుషులకు కూడా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని స్పష్టం చేసింది.
అసలు కేసు ఏంటి?
డా. షాజియా నవాజ్ ఖాన్, సయ్యద్ సామి అలీ దంపతులు గత రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. భార్యపై వివిధ ఫిర్యాదులు చేసిన భర్త సయ్యద్ సామి అలీ.. భోపాల్‌లోని ‘దార్ ఉల్-ఇఫ్తా’ మసీదు కమిటీకి లేఖ రాసి తలాక్‌పై అభిప్రాయం కోరారు. ఆ కమిటీ జారీ చేసిన లేఖను (ఫత్వా) ఆధారంగా చేసుకుని, భోపాల్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సవాల్ చేస్తూ భార్య ఫ్యామిలీ కోర్టులో ‘ఆర్డర్ 7 రూల్ 11 సీపీసీ’ కింద పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు స్పష్టీకరణ – కీలక తీర్పు:
ఈ కేసుపై విచారణ జరిపిన జబల్‌పూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ జస్టిస్ వివేక్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫత్వా అంటే తీర్పు కాదు.. ఏ మత సంస్థ లేదా ‘దార్ ఉల్-ఇఫ్తా’కు కూడా ముస్లిం పురుషుడికి నేరుగా ‘తలాక్’ ఇచ్చే అధికారిక చట్టపరమైన హోదా లేదు. మసీదు కమిటీ జారీ చేసే ఫత్వా కేవలం ఇస్లామిక్ గ్రంథాల ఆధారంగా ఇచ్చే మార్గదర్శకం మాత్రమే. అది స్వయంగా తలాక్ ఉత్తర్వు లేదా నిర్ణయం కాలేదు. భర్తలకు కూడా కోర్టుకెళ్లే హక్కు: ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 ప్రకారం కేవలం మహిళలకు మాత్రమే కోర్టును ఆశ్రయించే హక్కు ఉందనే అపోహను హైకోర్టు తొలగించింది. ఫ్యామిలీ కోర్టుల చట్టం-1984 సెక్షన్ 7(డి) ప్రకారం.. ముస్లిం పురుషులు కూడా నేరుగా ఫ్యామిలీ కోర్టులో తలాక్ పిటిషన్ దాఖలు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
ఫత్వాను ఆధారంగా చేసుకుని తలాక్ డిక్రీ కోరడం చట్టపరంగా చెల్లదని పేర్కొన్న హైకోర్టు.. భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, చట్టపరమైన నిబంధనల ప్రకారం భర్త నేరుగా ఫ్యామిలీ కోర్టులో కొత్తగా తలాక్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు వెసులుబాటు కల్పించింది.