Reading Time: 2 minutes
నేతలే కాదు.. ఇప్పుడు వారసులూ! కొనసాగుతున్న కేసుల పరంపర

ఒకప్పుడు రాజకీయ నాయకుడిపై కేసు నమోదైతే అది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యేది. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలే కాదు. వారి కుమారులు, కుటుంబ సభ్యులు కూడా పోలీసు కేసుల్లో కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది కొత్త చర్చకు తెరతీసింది.

కేసుల లెక్కలు…

2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీలపై కేసుల వరద కురిసిందని టీడీపీ, జనసేన, బీజేపీ,కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేశాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన వివరాల ప్రకారం… టీడీపీ నేతలపై 591 కేసులు, 162 అరెస్టులు, జనసేన నాయకులపై 24 కేసులు, బీజేపీ నేతలపై 16 కేసులు, కాంగ్రెస్ నాయకులపై 12 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ప్రత్తిపాటిపై మనీలాండరింగ్, జీఎస్టీ ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలు వచ్చాయి. కేసు విచారణలో ఉంది. నారా లోకేష్‌పై అమరావతి ఉద్యమాలు, అంగళ్లు ఘటన, నిరసన కార్యక్రమాలు తదితర అంశాలకు సంబంధించి వివిధ కేసుల్లో పేరు నమోదైంది.

అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల కొనుగోలు కేసులో అరెస్టై, అనంతరం బెయిల్ పొందారు. ఆ కేసు అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. పి. నారాయణపై అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్, ప్రశ్నాపత్రం లీక్ తదితర కేసుల్లో దర్యాప్తు ఎదుర్కొన్నారు. కొన్ని కేసులు తర్వాత న్యాయస్థానాల్లో నిలవలేదు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీ కేసులో అరెస్టయ్యారు. అనంతరం బెయిల్ పొందారు. చింతకాయల అయ్యన్నపాత్రుడిపై భూ ఆక్రమణ ఆరోపణలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డిపై వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో అరెస్టై, పలు కేసులు ఎదుర్కొన్నారు.

చింతమనేని ప్రభాకర్‌ టీడీపీ తరఫున అత్యధిక కేసులు ఎదుర్కొన్న నేతల్లో ఒకరు.అసెంబ్లీలో సమర్పించిన వివరాల ప్రకారం ఆయనపై 48 కేసులు, 15 అరెస్టులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం మారింది. కానీ కేసుల రాజకీయాలు ఆగలేదు. తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. ఆధారాలు ఉంటే చట్టం తన పని తాను చేస్తోందని కూటమి ప్రభుత్వం అంటోంది.

వారసులపై కేసులు…

ఇటీవల ఎక్కువగా చర్చకు వచ్చిన కేసుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పేరు ముందుంది. ఎన్నికల అనంతర హింస, దాడులు, హత్యాయత్నం ఆరోపణలతో కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఎన్నికల హింస కేసులో అరెస్టై, అనంతరం బెయిల్ పొందారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ హిట్ అండ్ రన్ కేసుతో రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ లిక్కర్ వ్యవహారంలో అమలు సంస్థల దర్యాప్తును ఎదుర్కొంటున్నారు.

అరెస్టులు.. విచారణ

గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ నూజివీడు పోలీసులు కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఓ వ్యాపారి కుమారుడిని అపహరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను గుజరాత్‌లో అరెస్టు చేశారు. విచారణ కొనసాగుతోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములను తప్పుడు పత్రాలతో ఆక్రమించి విక్రయించారనే ఆరోపణలతో ఏసీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది.కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌పై హత్యాయత్నం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపైనా విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. ఒకప్పుడు కేసులు రాజకీయ నాయకుల వరకే పరిమితమయ్యేవి. ఇప్పుడు కుటుంబ సభ్యుల వరకూ ఎందుకు విస్తరిస్తున్నాయి?

నాయకులు, కుమారులు, వ్యక్తిగత సహాయకులు, సోషల్ మీడియా నిర్వాహకులు. ఇప్పుడు దర్యాప్తు పరిధి మరింత విస్తరించింది. ఇది చట్టం మరింత కఠినంగా అమలవుతున్న సంకేతమా? లేక రాజకీయ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచే కొత్త వ్యూహమా అనే వాదన లేకపోలేదు. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. కేసు నమోదు కావడం అంటే నేరం రుజువైందని కాదు. దర్యాప్తు జరుగుతుంది. కోర్టు విచారణ జరుగుతుంది. తుది తీర్పు వచ్చిన తర్వాతే నిజం ఏంటో తేలుతుంది. అయితే రాజకీయ ప్రభావం మాత్రం అప్పుడే మొదలవుతుంది.

ఏది నిజం..?

చట్టం ముందు ఎవరూ అతీతులు కారని అధికార పక్షం అంటోంది. చట్టం అందరికీ సమానం కాదు. ఎంపిక చేసిన లక్ష్యాలపైనే అమలవుతోందని విపక్షం వాదనగా ఉంది. చట్టం నిజంగా అందరికీ ఒకటేనా లేక అధికారం మారినప్పుడల్లా లక్ష్యాలు మాత్రమే మారుతున్నాయా అనే చర్చ సాగుతోంది. రాజకీయాల్లో వారసత్వం పదవిని ఇవ్వొచ్చు. కానీ న్యాయస్థానంలో వారసత్వం కాదు. ఆధారాలే మాట్లాడతాయి.

చివరి మాట: రాజకీయ వారసత్వం అధికారాన్ని ఇవ్వొచ్చు. కానీ చట్టం ముందు వారసత్వానికి ప్రత్యేక హోదా ఉండదు.

కొండవీటి శివనాగరాజు

టీవీ9 డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్