Reading Time: < 1 minute
Telangana Education Department Orders Private Schools Fee Display

తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, ఆర్థిక పారదర్శకతను పెంచేందుకు తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల ఆర్థిక జవాబుదారీతనాన్ని నిర్ధారించడంతో పాటు తల్లిదండ్రులపై పడుతున్న అదనపు ఫీజుల భారాన్ని తగ్గించడానికి కీలక ముందడుగు వేసింది.

తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి తరగతుల వారీగా వసూలు చేస్తున్న ట్యూషన్ ఫీజుల వివరాలను తమ పాఠశాల నోటీసు బోర్డులలోను, అధికారిక వెబ్‌సైట్లలోనూ స్పష్టంగా ప్రదర్శించాలి. దీనితో పాటు, గత విద్యాసంవత్సరాలకు సంబంధించిన వార్షిక పరిపాలనా నివేదికలను, చార్టర్డ్ అకౌంటెంట్ (CA)చే ధ్రువీకరించబడిన ఆడిట్ నివేదికలను నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ పోర్టల్‌లో సమర్పించాల్సి ఉంటుంది.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవో నంబర్ 1 నిబంధనల ప్రకారం ఏటా ఆడిట్ నివేదికలు ఇవ్వడం తప్పనిసరి అయినప్పటికీ, గతంలో పర్యవేక్షణ కొరవడింది. ఈసారి మాత్రం ఆదేశాలు పాటించని పాఠశాలలపై షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా.. గుర్తింపు రద్దు వంటి తీవ్రమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. భవిష్యత్తులో ఫీజుల విచ్చలవిడి పెంపును అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త ఫీజు నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకొచ్చే యోచనలో ఉంది.