
యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించినా.. ఆ భారాన్ని సాధారణ వినియోగదారులు భరించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. యూపీఐపై MDR విధించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చేసిన విమర్శలకు స్పందిస్తూ ఆమె ఈ మేరకు స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం యూపీఐ, రూపే లావాదేవీలపై జీరో-MDR విధానం అమల్లో ఉంది. అయితే ఈ విధానంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించేలా ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026లో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో ఛార్జీలు విధించే అవకాశం ఉందంటూ రాజకీయ చర్చ మొదలైంది. ఈ అంశంపై జైరాం రమేశ్ స్పందిస్తూ.. MDR భారం చివరకు సామాన్య వినియోగదారులపైనే పడుతుందని ఆరోపించారు. యూపీఐని ఆర్థికంగా నిలకడగా కొనసాగించేందుకు ఇలాంటి ఛార్జీలు అవసరమవుతాయన్న ప్రభుత్వ వాదన కూడా సరైనది కాదని పేర్కొన్నారు.
దీనిపై నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎండీఆర్ అనేది మర్చంట్లకు మాత్రమే వర్తిస్తుందని.. ఎండ్ యూజర్లు లేదా కస్టమర్లపై ఈ ఛార్జీ ఉండదని స్పష్టం చేశారు. యూపీఐ వినియోగదారులు చెల్లించే లావాదేవీలపై ఎండీఆర్ భారం పడుతుందన్న వాదనలకు ఎలాంటి ఆధారం లేదన్నారు. యూపీఐ లావాదేవీలపై ప్రస్తుతం ఎండీఆర్ విధించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026 ఆమోదం పొందిన తర్వాతే ఈ అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని UPI అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఈ అంశంపై చర్చించాల్సి ఉంటుందని చెప్పారు. పార్లమెంట్ బిల్లును ఆమోదించిన తర్వాతే MDR విధించే అంశాన్ని కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ఛార్జీల నుంచి మినహాయింపును కొనసాగించే నిర్దిష్ట ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే అధికారం పొందనుంది. అయితే బిల్లులో ఎండీఆర్ విధించాలని ఎక్కడా తప్పనిసరిగా పేర్కొనలేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
ఎండీఆర్ ద్వారా వచ్చే ఆదాయం డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందని నిర్మలా సీతారామన్ వివరించారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక వసతులు, సైబర్ భద్రత, కొత్త ఆవిష్కరణలపై మరింత పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పెట్టుబడుల వల్ల చివరికి యూపీఐ వినియోగదారులందరికీ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.
ఇదే సందర్భంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల ఆందోళనలపైనా నిర్మలా సీతారామన్ విమర్శలు చేశారు. జూలై 20 నుంచి ఉభయ సభల్లో పదేపదే అంతరాయాలు ఏర్పడుతున్నాయని, దీంతో ప్రతిపాదిత బిల్లుపై అర్థవంతమైన చర్చ జరగడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో నిర్మాణాత్మకంగా వ్యవహరించి ఉంటే ఈ అంశాలపై సభలోనే చర్చించుకునే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
ప్రతిపాదిత ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026లో పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007లోని సెక్షన్ 10(A)లో మార్పులు చేయాలని ప్రతిపాదించారు. దీని ద్వారా యూపీఐ, రూపే లావాదేవీలపై ప్రస్తుతం అమల్లో ఉన్న జీరో-MDR విధానాన్ని భవిష్యత్తులో మార్చే అధికారం కేంద్రానికి లభించనుంది. అయితే ప్రస్తుత బిల్లు MDRను తప్పనిసరిగా విధించదు.. కేవలం భవిష్యత్తులో జీరో-MDR విధానాన్ని మార్చేందుకు చట్టపరమైన అవకాశం కల్పిస్తుంది.
Before spreading a canard, @Jairam_Ramesh ji, please consider this:
1. Merchant Discount Rate (MDR) applies only on the merchants and not on the end users/customers. It will support the Banks & Fintech to invest more on infrastructure, innovation & security. All users of UPI… https://t.co/sleUX4ztWe— Nirmala Sitharaman (@nsitharaman) August 6, 2026