
- ప్రైవేట్ శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని క్రిస్టియన్ మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మంది నిరుద్యోగులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగావసరాలకు తగిన నైపుణ్యాలు పెంపొందించేందుకు మూడు ప్రత్యేక కోర్సుల్లో ఈ శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం కోసం కార్పొరేషన్ రూ.9 కోట్లు ఖర్చు చేయనుంది. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా సహాయం అందించనుంది. ఈ నైపుణ్య శిక్షణ నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రైవేట్ శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు కోరగా, రాష్ట్రవ్యాప్తంగా 54 ఇన్‌స్టిట్యూట్లు అప్లై చేసుకున్నాయి.
సంస్థల అనుభవం, మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ సామర్థ్యం, గత ప్లేస్‌మెంట్ల రికార్డును పరిశీలించి కేవలం 12 సంస్థలను మాత్రమే అధికారులు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతం ఈ ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇన్‌స్టిట్యూట్ల ఎంపిక పూర్తయిన వెంటనే, జిల్లాల వారీగా దరఖాస్తు చేసుకున్న వారిలో 2 వేల మంది అర్హులైన నిరుద్యోగ యువతను ఎంపిక చేస్తారు. ఆపై ఎంపిక చేసిన 12 సంస్థల్లో బ్యాచ్‌ల వారీగా శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రైవేట్ రంగంలో సరైన ఉద్యోగ అవకాశాలు లభించేలా కార్పొరేషన్ తగిన మార్గదర్శకత్వం అందించనుంది.