Reading Time: < 1 minute
Husharu Pittalu Movie Press Meet Actor Bhanu Emotional Speech

సినిమా పిచ్చితో అవకాశాల కోసం ఎన్నో ఏళ్లు పోరాడిన ఒక సాధారణ యువకుడి కల నెరవేరితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ‘హుషార్ పిట్టలు’ మూవీ ప్రెస్ మీట్‌లో ప్రత్యక్షంగా కనిపించింది. ఈ సినిమాలో ‘పుట్ట భాను’గా నటించిన నటుడు భాను, మొదటిసారి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్‌లో అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇది కలా నిజమో అర్ధం కావడం లేదంటూ అతను పొట్టు పొట్టున తన చెంప మీద కొట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు.  ఈవెంట్లో భాను మాట్లాడుతూ, “నాకు చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చి ఎక్కువ. ఊర్లో ఏ సినిమా పడ్డా ఫస్ట్ షో థియేటర్లో వాలిపోయేవాడిని. స్క్రీన్ మీద కామెడీ చూసి నవ్వుకునే నేను, మొన్న ‘హుషార్ పిట్టలు’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు పెద్ద స్క్రీన్ మీద నన్ను చూసి కింద జనాలు నవ్వుతుంటే కళ్లంబడి నీళ్లు తిరిగాయి. అసలు ఇది కలనా, నిజమా అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా నటుడిగా నిరూపించుకోవాలనే పట్టుదలతోనే ఇన్నాళ్లూ ఉన్నాను” అని ఎమోషనల్ అయ్యారు.

సినిమా అవకాశాల కోసం తాను పడిన తపనను పంచుకుంటూ, “చాన్స్‌ రావాలని బోయిన్ పల్లి ఎల్లమ్మ తల్లికి మొక్కుకుని, ప్రతి మంగళవారం చెప్పులు కూడా వేసుకోకుండా తిరిగాను. అవకాశం వచ్చి సినిమా రిలీజ్ అయ్యాక దేవుడికి 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నా. కానీ నన్ను ఒక నటుడిగా నిలబెట్టి, ఇంత మంచి పాత్ర ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రసాదించిన మా డైరెక్టర్ భిక్ష అన్న, ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ అన్నల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే అమ్మవారితో పాటు, నాకు లైఫ్ ఇచ్చిన వీళ్లకు కూడా ప్రత్యేకంగా 100 కొబ్బరికాయలు కొడతాను” అని భాను కృతజ్ఞతలు తెలిపారు. చిన్న క్యారెక్టర్ అనుకుంటే తనకు ఎంతో ప్రాధాన్యత ఉన్న మంచి పాత్ర ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భాను మాట్లాడిన ఈ నిష్కల్మషమైన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.