
సింహం అడవిలో జంతువులను వేటాడటం రొటీన్… కానీ, ఆవును చూసి సింహం భయపడటం చూశారా..? ఆవును చూసి సింహం భయపడటం ఏంటి బాస్… అనుకుంటున్నారా..? అవును నిజమే, ఆవును చూసి ఒక్క సింహం కాదు ఏకంగా ఏడు సింహాలు ప్యాంటు తడిపేసుకున్నాయంటే నమ్మండి..! గుజరాత్ లో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరు కచ్చితంగా నమ్ముతారు. గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలో జరిగింది ఈ అరుదైన ఘటన. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
అమ్రేలి జిల్లా రాజులా తాలూకాలోని ఖారీ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. రాత్రి సమయంలో ఏడు సింహాలు ఒక అవును చుట్టుముట్టాయి. అయితే.. ఆవు ఏమాత్రం భయపడకుండా కొమ్ములతో ఎదురుదాడికి దిగింది.ఎలా అయినా ఆవును ఎటాక్ చేద్దామనుకున్న సింహాల ప్లాన్ వర్కౌట్ కాలేదు.
ఆవు ఏమాత్రం భయపడకుండా సింహాలకు ఎదురెళ్ళడంతో అవి తోకముడిచాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గిర్ అడవులకు ఆనుకొని ఉన్న అమ్రేలి ప్రాంతంలో సింహాలు తరచూ గ్రామాల్లోకి వస్తుంటాయని అంటున్నారు స్థానికులు. అయినప్పటికీ సాధు జీవి అయిన ఆవు ఏకంగా ఏడు సింహాలను ఎదిరించడం అరుదైన ఘటన అని అంటున్నారు స్థానికులు.