
హైదరాబాద్: అంబేద్కర్ కొందరివాడు కాదు..అందరివాడు అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండవద్దని కోరుకుంటున్నామని అన్నారు. సిద్దిపేట: బంజరుపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్నిహరీష్ రావు, పార్టీనాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. నేటితో వందకు వంద శాతం అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటు పూర్తవుతుందని తెలియజేశారు. తన చదువు తన కోసం కాదని..అణగారిన వర్గాల కోసమని అంబేద్కర్ భావించారని, దేశం కోసం సమాన హక్కుల కోసం ఉన్నత చదువులు చదువుకుని గొప్ప సేవలు అందించారని కొనియాడారు. భిన్నమైన మతాలు, కులాలు, జాతులు ఉన్న భారతదేశం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే దేశంగా పరిఢవిల్లుతోందని, అంబేద్కర్ ముందుచూపు, ఆలోచతో రాజ్యాంగాన్ని రచించారని హరీష్ రావు పేర్కొన్నారు.
అమెరికా వంటి దేశంలో మొన్నటి వరకు మహిళలకు హక్కులేదని, అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే కుల,మత, లింగ బేధాలు లేకుండా..దేశ ప్రజలందరికీ సమాన హక్కును కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని ప్రశంసించారు. అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితోనే ఎలాంటి గొడవలు లేకుండా దేశం చల్లగా ఉందని, రాజ్యాంగం వల్లనే ఎస్సి, ఎస్టిలకు ఉద్యోగాలు, చట్టసభల్లో రిజర్వేషన్లు లభిస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడమే కాదని..ఆయన సిద్ధాంతాలను అమలు చేసినప్పుడే ఘన నివాళి అర్పించాలని సూచించారు. అంబేద్కర్ పెట్టిన భిక్షతోనే ఎంతో మంది ఉన్నత విద్య చదివారని.. ఉద్యోగాలు పొందుతున్నారని అన్నారు. అన్యాయం జరిగితే గొంతెత్తి పోరాడాలని అంబేద్కర్ చెప్పారని, అందరికీ సమానత్వం కావాలని..రాజ్యాంగాన్ని ఆచరించాలని అన్నారు. తెలంగాణ వచ్చిందంటే అంబేద్కర్ రాజ్యాంగం ఆర్టికల్-3 వల్లనేనని, 60 ఏళ్ల క్రితమే రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఏర్పడిందని అన్నారు. అంబేద్కర్ ముందుచూపు దేశానికి రక్షణ కవచంలా మారిందని హరీష్ రావు స్పష్టం చేశారు.