Reading Time: < 1 minute

సీఎం విజయ్ ఆవు – మేక పథకం : అప్పట్లో జయలలిత మాదిరిగానే..

Caption of Image.

అటు పాలనాపరమైన అంశాల్లో, సంక్షేమంలో తనదైన మార్క్ వేసే దిశగా అడుగులేస్తున్నారు తమిళనాడు సీఎం విజయ్. ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న విజయ్ ఇప్పుడు మరో ముందడుగు వేశారు. బలహీన వర్గాల మహిళల కోసం ఉచిత ఆవులు, మేకల పథకం ప్రకటించింది విజయ్ సర్కార్. ఈ పథకంతో పశుసంపద రంగం ద్వారా గ్రామీణ జీవనోపాధి బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత ప్రవేశపెట్టిన ఉచిత ఆవు పథకాన్ని పునరుద్ధరిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించింది విజయ్ సర్కార్.అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ పథకానికి నిధులు కూడా కేటాయించింది ప్రభుత్వం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పాడి పరిశ్రమ ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ప్రతి సంవత్సరం పది వేల మంది అర్హులైన మహిళలకు రూ.57 కోట్లతో ఉచితంగా పాలిచ్చే ఆవులను అందించనున్నట్లు తెలిపారు ఆర్థిక మంత్రి మేరీ విల్సన్.

అంతే కాకుండా వెట్రి మగళిర్ మేకల పెంపకం పథకం కింద నిరుపేద వితంతువులకు, భర్తలు వదిలేసినా మహిళలకు, ట్రాన్స్ జెండర్లకు, దివ్యాంగులకు ఐదు మేకలు లేదా గొర్రెలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. రూ.110 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం ద్వారా 30 వేల మంది లబ్ది పొందనున్నట్లు తెలుస్తోంది. 

పాడి రైతులను నష్టాల నుండి కాపాడటానికి ‘కాలనడైగల్ కాప్పోమ్’ పశుసంపద బీమా పథకానికి రూ. 31 కోట్ల కేటాయించింది ప్రభుత్వం. పశువైద్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, ప్రభుత్వం 41 కొత్త పశువైద్య ఆసుపత్రులను నిర్మించడం, 25 ఆసుపత్రులను పాలిక్లినిక్‌లుగా మరియు 210 డిస్పెన్సరీలను పశువైద్య ఆసుపత్రులుగా ఉన్నతీకరించడంతో పాటు, మారుమూల ప్రాంతాలలో పశు ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడానికి 143 కొత్త మొబైల్ పశువైద్య యూనిట్లను కూడా ఏర్పాటు చేయనుంది.

©️ VIL Media Pvt Ltd.