
జెన్-జీ యువతకు మద్దతుగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ స్పందించారు. జెన్-జీ యువతకు మోహన్ భగవత్ నుంచి ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ప్రియాంక గాంధీ.. ‘‘వారికి మోహన్ భగవత్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదు.’’ అని వ్యాఖ్యానించారు.
జూలై 20న పేపర్ లీకేజీ అంశంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఆయన ఉభయ సభలకు రావడం లేదని ఆరోపించారు. ‘‘ఆయన వచ్చి ప్రకటన చేయాలి. అందులో సమస్య ఏముంది? ఏదైనా తప్పు జరిగితే బాధ్యత తీసుకోవాలి.’’ అని డిమాండ్ చేశారు.
మోహన్ భగవత్ గురువారం జెన్-జీ యువతకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువత చేస్తున్న ఆందోళనలను దేశ వ్యతిరేక చర్యలుగా చూడకూడదన్నారు. వారి సమస్యలు నిజమైనవేనని, యువత నిజాయితీపై తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. ఐఐఎంయూఎన్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో సుమారు 2,000 మంది జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతను ఉద్దేశించి భగవత్ మాట్లాడారు. ‘‘నిరసన కూడా సంభాషణకు ఒక మార్గం. ప్రజాస్వామ్యంలో నిరసన అనేది ఏకాభిప్రాయం సాధించే విధానం. భిన్నమైన అభిప్రాయాలు చర్చల ద్వారా కలిసినప్పుడు ఏకాభిప్రాయం ఏర్పడుతుంది.’’ అని అన్నారు. జెన్-జీ యువత ఆందోళన చేస్తే వారు దేశ వ్యతిరేకులు కాదని.. వారు మనవాళ్లు.. మన తర్వాతి తరం. వారితో చర్చలు జరపాలి, సత్సంబంధాలు కొనసాగించాలని స్పష్టం చేశారు.
NEET పేపర్ లీకేజీ ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థుల ఆందోళనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో భగవత్ జెన్-జీ, జెన్-ఆల్ఫా యువతతో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. జెన్-జీ అంటే సాధారణంగా 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని, జెన్-ఆల్ఫా అంటే 2013 నుంచి 2025 మధ్య జన్మించిన వారిని సూచిస్తారు.
ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్ల అంశంపైనా మోహన్ భగవత్ స్పందించారు. సామాజిక వివక్షకు గురైన వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించేందుకే రిజర్వేషన్ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. సమాజంలో అసమానతలు కొనసాగుతున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచనలను నిజాయితీగా పాటిస్తే ఎలాంటి సమస్య ఉండదని.. సామాజిక వివక్షను ఎదుర్కొనేందుకే రిజర్వేషన్ తీసుకొచ్చారని.. సామాజిక వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే రిజర్వేషన్ ద్వారా ఇప్పటికే అభివృద్ధి సాధించిన వారు మరింత ప్రయోజనాలను వదులుకుని, అదే అవకాశాలను ఇతర వెనుకబడిన వర్గాలకు అందించే విషయాన్ని కూడా ఆలోచించాలని మోహన్ భగవత్ సూచించారు.