Reading Time: < 1 minute
Rahul Gandhi Silence Jharkhand Student Exam Protests

Rahul Gandhi: దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అవకతవకలు, పేపర్ లీకేజీలపై నిరంతరం గళమెత్తుతున్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇటీవల జార్ఖండ్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలపై మౌనం వహించడం రాజకీయ వర్గాల్లోనూ, విద్యార్థి సంఘాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విద్యార్థులపై కపట ప్రేమ చూయిస్తున్నారని తేటతెల్లమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా నీట్ (NEET), ఇతర కేంద్ర పోటీ పరీక్షల లీకేజీలపై జరిగిన నిరసనలకు రాహుల్ గాంధీ నేరుగా మద్దతు తెలిపడమే కాకుండా, పార్లమెంట్ లోపలా బయటా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కానీ, జార్ఖండ్‌లో జేపీఎస్సీ (JPSC), జేఎస్‌ఎస్సీ-సీజీఎల్ (JSSC-CGL) వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో జరిగాయని చెబుతున్న అక్రమాలపై విద్యార్థులు రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నప్పటికీ ఆయన స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యూహాత్మక మౌనానికి ప్రధాన కారణం రాజకీయ మైత్రి, కూటమి ధర్మమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ అక్కడి విద్యార్థుల నిరసనలకు బహిరంగంగా మద్దతు ఇస్తే, అది సొంత ప్రభుత్వాన్ని, మిత్రపక్షమైన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాలనను ప్రశ్నించినట్లవుతుంది. ఇది రాష్ట్రంలో కూటమి స్థిరత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా, ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్‌పై రాజకీయ ఆయుధాన్ని అందించినట్లవుతుంది. అయితే, ఈ వైఖరి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, స్థానిక విద్యార్థి సంఘాల నుంచి తీవ్ర నిరసనలకు దారితీసింది. బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై పక్షపాత ధోరణి, రెండు రకాల ప్రమాణాలు (Double Standards) పాటిస్తున్నారని విమర్శిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదా కేంద్ర పరిధిలో జరిగే పరీక్షల లోపాలపై విద్యార్థుల తరఫున మాట్లాడే ఆయన, కాంగ్రెస్ భాగస్వామ్య ప్రభుత్వం ఉన్న చోట నిరుద్యోగ యువత పడుతున్న బాధలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు, యువతకు సంబంధించిన సమస్యలు ఏ రాష్ట్రానికి చెందినవైనా ఒకే రీతిగా చూడాలని, రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని నిరసనకారులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా పొత్తులతో సంబంధం లేకుండా స్పందించాలని కోరుతున్నారు.