Reading Time: 2 minutes
Easy Trick For Perfect Jowar Rotis To Make Soft Jowar Roti At Home

Jowar Roti: ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలామంది చపాతీలకు బదులుగా చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులో ‘జొన్న రొట్టె’ను ప్రద్ధానంగా వారి ఆహారంలో చేర్చుకుంటున్నారు ప్రజలు. ఈ జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీటిని తయారు చేయడం చాలామందికి సవాలుగా మారుతుంది. రొట్టె ఒత్తేటప్పుడు విరిగిపోవడం, పెనంపై సరిగా పొంగకపోవడం లేదా కాల్చిన వెంటనే గట్టిగా మారిపోవడం వంటి సమస్యలు తరచూ ఎక్కువగా ఎదురవుతుంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటే ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఒక చిన్న కిచెన్ ట్రిక్ పాటిస్తే చాలు జొన్న రొట్టెలు మెత్తగా, చక్కగా పొంగేలా తయారవుతాయి.

జొన్న పిండిని ఇలా సిద్ధం చేసుకోండి..

ముందుగా స్టవ్‌పై ఒక పాత్ర పెట్టి అందులో పావు కప్పు నీరు పోయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె, తగినంత ఉప్పు వేసి కలపాలి. తర్వాత దాదాపు ఒకటిన్నర కప్పుల జొన్న పిండి వేసి తక్కువ మంటపై కలుపుతూ ఉండాలి. పిండి ఒక ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మరో పాత్రలోకి తీసి కొద్దిగా చల్లారనివ్వాలి.

పిండి కలిపేటప్పుడు..

పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మరో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా ముద్దలా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండి మెత్తగా మారుతుంది. రొట్టె ఒత్తేటప్పుడు పగలకుండా ఉంటుంది.

రొట్టె ఒత్తడం..

ముందుగా పెనాన్ని వేడి చేసి దానిపై కొద్దిగా నూనె రాయాలి. తర్వాత పిండితో చిన్న ఉండ తీసుకుని మెల్లగా రొట్టెగా ఒత్తాలి. పెనంపై వేసి అవసరమైతే కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి రెండు వైపులా బాగా కాల్చాలి. ఇలా చేస్తే రొట్టె మెత్తగా ఉండటంతో పాటు బాగా పొంగే అవకాశమూ ఉంటుంది.

జొన్న పిండిని ముందుగా కొద్దిగా నీటితో ఉడికించడం వల్ల అందులో తేమ బాగా నిల్వ ఉంటుంది. దీంతో పిండి మరింత మృదువుగా, వంగే స్వభావంతో మారుతుంది. ఫలితంగా రొట్టె ఒత్తడం సులభమవుతుంది. కాల్చిన తర్వాత కూడా ఎక్కువసేపు మెత్తగానే ఉంటుంది. వేడి వేడి జొన్న రొట్టెలను మీకు ఇష్టమైన కూర, పప్పు, వెల్లుల్లి కారంతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. అంతేకాదు రోజువారీ ఆహారంలో జొన్న రొట్టెలను చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి.