
మహారాష్ట్రలో నకిలీ పనీర్ తయారీ, అమ్మకాలపై ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే వారికి 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.1 లక్ష వరకు జరిమానా విధించనున్నారు. నకిలీ, కల్తీ పాల ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ తర్వాత ఇలాంటి నిషేధం విధించిన రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది.
ఏమిటి ఈ నిషేధం ?
పాలతో కాకుండా పామాయిల్, నూనెలు, ఇతర రసాయనాలు కలిపి తయారు చేసే నకిలీ పనీర్ తయారీ, ప్యాకింగ్, రవాణా, అమ్మకాలను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా బ్యాన్ చేశారు.
శిక్షలు ఎలా ఉంటాయి ?
ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం నకిలీ పనీర్ అమ్ముతూ దొరికితే 6 నెలల జైలు, రూ. 1 లక్ష జరిమానా పడుతుంది. ఒకవేళ కల్తీ ఆహారం తిని ఎవరైనా చనిపోతే, దోషులకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు కనీసం రూ. 10 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది.
ఎందుకు ఈ నిర్ణయం?
నిజమైన పాల పనీర్ అని చెప్పి, ప్రజలను మోసం చేస్తూ అనారోగ్యకరమైన నకిలీ పనీర్‌ను అమ్ముతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఈ చర్యలు చేపట్టింది.
నిబంధనలు ఏంటి?
FSSAI నిబంధనల ప్రకారం పనీర్‌ను కేవలం పాలతోనే తయారు చేయాలి. పాలేతర(Non-dairy) పదార్థాలతో చేసే పనీర్‌ను విక్రయించాలంటే, అది నకిలీదని స్పష్టంగా లేబుల్ చేసి అమ్మాలి. కానీ, చాలాచోట్ల దీనిని అసలైన పనీర్‌గా నమ్మిస్తూ మోసం చేస్తున్నారు.
ఇటీవల పూణేలోని ఒక గోదాముపై దాడి చేసిన అధికారులు, సుమారు 1,400 కిలోల నకిలీ పనీర్‌తో పాటు 1,800 కిలోల మీగడ తీసిన పాల పొడి, 400 కిలోల గ్లిసరాల్ మోనోస్టియరేట్ (GMS) పొడి, 718 లీటర్ల పామాయిల్, మిల్క్ పౌడర్ రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబై సహా రాష్ట్రవ్యాప్తంగా అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.