
దేశంలో డిజిటల్ చెల్లింపుల్లో భారీ మార్పు తీసుకొచ్చిన UPI సర్వీస్ త్వరలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన Payment and Settlement Systems (Amendment) Bill, 2027 ఆమోదం పొందటంతో కొన్ని UPI లావాదేవీలపై మళ్లీ మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) అమలుకు మార్గం సుగమం అయ్యింది. దీంతో ఇప్పటివరకు ఉచితంగా జరుగుతున్న కొన్ని డిజిటల్ చెల్లింపులకు పరోక్షంగా ఛార్జీలు పడనున్నాయి.
MDR ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారు?
ప్రస్తుతం UPIపై జీరో MDR విధానం అమల్లో ఉంది. అంటే వ్యాపారులు యూపీఐ ద్వారా చెల్లింపులు స్వీకరించినప్పుడు బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఈ విధానం వల్ల యూపీఐ వ్యవస్థను నిర్వహించడం బ్యాంకులు, పేమెంట్ కంపెనీలకు ఆర్థికంగా భారంగా మారిందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది. అందుకే భవిష్యత్తులో స్థిరమైన ఆదాయ నమూనా తీసుకురావాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.
Lok Sabha passes The Taxation and Other Laws (Amendment) Bill, 2026.
The Bill further amends the Payment and Settlement Systems Act, 2007, the Income-tax Act, 2025, and the Finance Act, 2026.#LokSabha #Parliament #Taxation #FinanceBill #Legislation… pic.twitter.com/jtlsp9YKvf
— SansadTV (@sansad_tv) August 6, 2026
ఎవరికి ఛార్జీలు పడతాయి?
ప్రతిపాదిత బిల్లు ప్రకారం సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రూ.2వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు.. ముఖ్యంగా పెద్ద వ్యాపార సంస్థలు, ఈ-కామర్స్ కంపెనీలకు చేసే చెల్లింపులపై మాత్రమే MDR అమలు చేసే అవకాశం ఉంది. వ్యక్తి నుంచి వ్యక్తికి డబ్బు పంపడం, టీ దుకాణాలు, కిరాణా షాపులు, కూరగాయల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు చేసే UPI చెల్లింపులు గతంలో మాదిరిగా ఫ్రీగానే కొనసాగే అవకాశం ఉంది.
ఎవరికి భారీ లాభం?
MDR తిరిగి అమల్లోకి వస్తే బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ సంస్థలకు భారీ ఆదాయం వచ్చే అవకాశముంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటివి ఎక్కువగా లాభపడే అవకాశం ఉందని అంచనా. ఇందులో SBI ఒక్కటే ఏడాదికి సుమారు రూ.3వేల కోట్ల వరకు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది కొత్త యూపీఐ ఛార్జీలతో.
ALSO READ : UPI పేమెంట్స్పై ఛార్జీలు వేసుకోండి: బ్యాంకులకే అధికారం..
అలాగే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ సంస్థలు కూడా ప్రస్తుతం వ్యాపార UPI లావాదేవీల నుంచి పెద్దగా ఆదాయం పొందడం లేదు. MDR ఛార్జీలు అమలులోకి వస్తే ఫోన్ పే, పేటీఎంలకు ఏడాదికి సుమారు రూ.700 కోట్లు, గూగుల్ పేకు దాదాపు రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా.
వినియోగదారులపై ప్రభావం?
MDRను నేరుగా వినియోగదారులు చెల్లించరు. ఈ ఛార్జీలను వ్యాపారులు భరించాల్సి ఉంటుంది. అయితే కొందరు వ్యాపారులు ఆ అదనపు భారాన్ని ఉత్పత్తుల రేట్లు పెంచేసి వినియోగదారులపై మోపే అవకాశం కూడా ఉంది. మరికొందరు వ్యాపారులు క్యాష్ పేమెంట్స్ డిమాండ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇదే జరిగితే మళ్లీ డిజిటల్ ఇండియా కాస్త ఫిజికల్ క్యాష్ చెల్లింపుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఉన్న జీఎస్టీ, ఆదాయపు పన్ను లాంటి ఖర్చులకు ఇవి కూడా చేరటం వ్యాపారులను యూపీఐ చెల్లింపులకు దూరంగా జరిగేలా ప్రేరేపించొచ్చని నిపుణులు అంటున్నారు. సో లోక్ సభలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన వేళ.. రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే పేమెంట్ ఎకోసిస్టమ్ మెుత్తం కీలక మార్పులకు గురవనుంది.