Reading Time: 2 minutes
Telanagana: అబ్బా.. ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..

అతనో ప్రభుత్వ డాక్టర్.. హాస్పిటల్‌కు వెళ్లడు, వైద్యులను పరిశీలించడు.. కానీ నెల నెలా జీతం మాత్రం కరెక్ట్‌గా తీసుకుంటాడు. అదెలా అనుకుంటున్నారా? ఇక్కడే మీరు ఆ డాక్టర్ అతి తెలివి చూడాలి. తన స్థానంలో ఓ ప్రైవేట్‌ డాక్టర్‌ను పెట్టి.. ప్రభుత్వ జీతం మాత్రం అతను తీసుకుంటున్నాడు. సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ భాగోతం కాస్తా వైద్యారోగ్య శాఖ మంత్రి దృష్టికి చేరడంతో ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. బాధ్యుడైన డిప్యూటీ సివిల్ సర్జన్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ కె. రమేష్ అనే వ్యక్తి సివిల్ సర్జన్ జనరల్ మెడిసిన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్‌లో సివిల్ సర్జన్‌గా ఉన్న రమేష్ గత కొన్ని నెలల క్రితం డిప్యూటేషన్ పై జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. కాగా ఇతనికి సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. అయితే ఇతను తన విధులకు హాజరుకాకుండా.. తన స్థానంలో రవి అనే ఒక ప్రైవేట్ డెంటల్ డాక్టర్‌ను డ్యూటీలో పెట్టాడు.

దీంతో రవినే డాక్టర్ రమేష్ స్థానంలో డైలీ హాస్పిటల్‌కు వెళ్తూ అసలు సిసలైన ప్రభుత్వ డాక్టర్‌లా చెలామణి అయ్యాడు. జనరల్ మెడిసిన్ వార్డుకు వచ్చే రోగులకు వైద్యం అందిస్తూ, ప్రిస్క్రిప్షన్లు రాస్తూ గత కొన్ని రోజులుగా తానే అసలైన డాక్టర్‌గా పోజులు కొట్టాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళగా వారు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక విచారణ జరపగా, రమేష్ నైట్ డ్యూటీలకు రాకుండా వేరొకరిని పంపుతున్నాడనే విషయం విచారణ కమిటీ పరిశీలనలో నిర్ధారణ అయింది.

ఈ ఘటన పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్రంగా స్పందించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. డ్యూటీకి డుమ్మా కొడుతూ తన స్థానంలో వేరొకరితో డ్యూటీ చేయిస్తున్న డాక్టర్ రమేష్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. అలాగే ఆసుపత్రిలో ఇంత జరుగుతున్నా పట్టించుకోని ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూను మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ వైద్య రంగానికి మచ్చ తెచ్చే ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రోగుల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యుడే ఇలాంటి మోసాలకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు నకిలీ డాక్టర్‌గా చలామణి అయిన రవిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది..ఇక భవిష్యత్తులో ఏ ఆసుపత్రిలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.