
Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు షకీబ్ అల్ హసన్ నివాసంపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. బంగ్లాదేశ్‌లోని మగురా నగరంలో ఉన్న ఆయన ఖాళీ ఇంటిపై కొందరు నిరసనకారులు దాడి చేశారు. దాడి చేసేందుకు వచ్చిన వారు పెట్రోల్ బాటిళ్లతో వచ్చి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఊహించని దాడి ఘటనపై షకీబ్ అల్ హసన్ తొలిసారిగా నోరు విప్పారు.
సమావేశంలో పాల్గొనడమే దాడికి కారణమా?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల నిర్వహించిన ఒక వర్చువల్ సమావేశంలో అవామీ లీగ్ పార్టీ తరఫున ఎంపీగా పనిచేసిన షకీబ్ అల్ హసన్ కూడా పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆయన ఎలాంటి ప్రసంగం చేయనప్పటికీ, ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఇంటిపై దాడి జరిగింది. 2024లో బంగ్లాదేశ్‌లో జరిగిన విద్యార్థి ఉద్యమం, రాజకీయ అలజడుల నుంచి షకీబ్ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లలేదు. ప్రస్తుతం ఆయన తన కుటుంబంతో అమెరికాలో నివాసముంటూ, శ్రీలంకలో ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నారు.
ప్రభుత్వానికి షకీబ్ షరతు
రాయిటర్స్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్ ప్రభుత్వం నాకు పూర్తి భద్రత ఇస్తుందని హామీ ఇస్తే, నేను సంతోషంగా నా దేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను. కోర్టులో నాపై ఉన్న ఆరోపణలను ఎదుర్కోవడానికి, అవసరమైన ప్రతి విచారణకు సహకరించడానికి నేను సిద్ధం. నేను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. మా నాయకురాలు (షేక్ హసీనా) చెప్పిన సూచనల ప్రకారమే మేము నడుచుకుంటాం. నేను ఎప్పుడూ శాంతిని, బంగ్లాదేశ్ అభివృద్ధిని మాత్రమే కోరుకున్నాను” అని స్పష్టం చేశారు.
ఫేర్‌వెల్ సిరీస్, 2027 వరల్డ్ కప్ లక్ష్యం
39 ఏళ్ల షకీబ్ అల్ హసన్ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. స్వదేశంలో బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున ఒక ఫేర్‌వెల్ సిరీస్ ఆడి ఆటకు వీడ్కోలు చెప్పాలని ఆయన ఆశిస్తున్నారు. అంతేకాకుండా అంతా అనుకూలిస్తే 2027 వన్డే ప్రపంచ కప్‌లో కూడా బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగలననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డిసెంబరు నెలలో అవామీ లీగ్ నాయకులతో కలిసి స్వదేశానికి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..