
థియేటర్‌కి వెళ్లి మూవీ చూడాలంటే భారీ టికెట్ ధరలు చెల్లించాల్సిన పరిస్థితికి త్వరలో తెరపడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని మూవీ లవర్స్ కి పెద్ద మల్టీప్లెక్స్ అనుభూతిని అందుబాటు ధరలో ఇచ్చేందుకు దేశంలోని అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్ PVR INOX కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. కేవలం రూ.189 గరిష్ఠ టికెట్ ధరతో ‘స్మార్ట్ సినిమా’ థియేటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీంతో తక్కువ ఖర్చులోనే అత్యాధునిక సౌకర్యాల్లో సినిమా ఎంజాయ్ చేయాలనుకుంటున్న మూవీ లవర్స్ కల త్వరలో నిజం కానుంది.
పీవీఆర్ ఐనాక్స్ రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 300 ‘స్మార్ట్ సినిమా’ థియేటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముజఫర్‌పూర్, బరాక్‌పూర్, హనుమాన్‌గఢ్ వంటి చిన్న పట్టణాల్లో తొలి దశలో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేయబోతోంది కంపెనీ. ఈ థియేటర్లను ఫ్రాంచైజీలు లేకుండా మెయింటెనెన్స్ బాధ్యతలను పీవీఆర్ ఐనాక్స్ స్వయంగా చేపట్టనుంది. పెద్ద నగరాల్లో దొరికే మల్టీప్లెక్స్ మూవీ అనుభవాన్ని చిన్న పట్టణాల్లోని ప్రేక్షకులకు కూడా అందించాలన్నదే దీనికి పునాది అంటోంది కంపెనీ.
ఈ కొత్త థియేటర్లలో గరిష్ఠ టికెట్ ధర రూ.189 మాత్రమే ఉండనుండగా.. ఇది మెట్రో నగరాల్లో ప్రస్తుతం ఉన్న సగటు టికెట్ ధరతో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువ. అలాగే ఫుడ్ కౌంటర్లలో కూడా తక్కువ రేట్లకే పాప్‌కార్న్, నాచోస్ వంటి స్నాక్స్ అందించనున్నారు. చిన్న పట్టణాల్లో ల్యాండ్, పవర్ బిల్స్, సిబ్బంది, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటంతో ఈ ధరలకు టిక్కెట్స్ అందించటం సాధ్యమవుతున్నట్లు కంపెనీ తెలిపింది.
అయితే పీవీఆర్ ఐనాక్స్ టార్గెట్ కేవలం సినిమాలు ప్రదర్శించడమే కాదు. ప్రేక్షకులను థియేటర్లకు మరింత ఆకర్షించేందుకు వర్చువల్ రియాలిటీ గేమ్స్, ఫోటో బూత్‌లు వంటి ఎంటర్టైన్మెంట్ సదుపాయాలను కూడా పరీక్షిస్తోంది. మరోవైపు స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్, మ్యూజికల్ ఈవెంట్స్, TED Talks, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కార్పొరేట్ సమావేశాలను కూడా మల్టీప్లెక్స్‌లలో నిర్వహించే ప్లాన్స్ చేస్తోంది. గత ఏడాది ఈ ప్రత్యామ్నాయ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది ప్రేక్షకులను ఆకర్షించిన సంస్థ, ఈ ఏడాది కూడా మరింత వృద్ధిని ఆశిస్తోంది.
ఇటీవల విడుదలైన భారీ చిత్రాలతో బాక్సాఫీస్‌కు మళ్లీ జోష్ వచ్చిన నేపథ్యంలో పీవీఆర్ ఐనాక్స్ ఈ విస్తరణకు శ్రీకారం చుట్టింది. త్వరలో విడుదల కానున్న పలు పాన్ ఇండియా, హాలీవుడ్ భారీ చిత్రాలు కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురానున్నాయి. అలాంటి సమయంలో రూ.189కే మల్టీప్లెక్స్ అనుభవం అందుబాటులోకి రావడం సినీ అభిమానులకు నిజంగా డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఇలా అయినా ప్రజలను ఓటీటీలకే పరిమితం కావటం నుంచి తిరిగి థియేటర్లకు వచ్చేలా చేయాలని పీవీఆర్ ఐనాక్స్ భావిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి.