Reading Time: < 1 minute

గ్రామసభ అనంతరం సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నం.. కరీంనగర్ జిల్లాలో ఘటన

Caption of Image.

గ్రామ సభ అనంతరం సర్పంచ్ భర్త ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. గ్రామసభ అనంతరం పరుగు పరుగున ఇంటికి వెళ్లి.. ఇంట్లో ఉన్న మాత్రలు అధిక మోతాదులో వేసుకోవడం టెన్షన్ కు గురిచేసింది. జిల్లాలోని  గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో బుధవారం (ఆగస్టు 05) జరిగింది ఈ ఘటన.

వివరాల్లోకి వెళ్తే.. నారాయణపూర్ సర్పంచ్ దీకొండ లక్ష్మి భర్త దీకొండ మధు ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డారు. గ్రామ సభ అనంతరం మాత్రలు మింగటంతో  వెంటనే కరీంనగర్ లోని ఓ  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.   

నారాయణపూర్ ముంపు గ్రామం విషయంలో సర్పంచి భర్తపై గ్రామస్తులు తప్పుడు ప్రచారాలు చేయడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  గ్రామ వాట్స్ ఆప్ గ్రూప్ లలో సర్పంచ్ పై  విమర్శలు చేస్తున్నారని ఆవేదనతోనే సూసైడ్ అంటెంప్ట్ చేసినట్లు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. 

పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే:

చికిత్స పొందుతున్న  నారాయణ పూర్ గ్రామ సర్పంచి లక్ష్మి భర్త ధీకొండ మధను పరామార్శించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. దళిత సామాజిక వర్గానికి చెందిన సర్పంచి లక్ష్మిని, ఆమె భర్తను గ్రామంలోని కొందరు వేధింపులకు గురిచేయడం వల్లే ఆయన ఇవాళ మందు గోలీలు మింగి ఆత్మహత్యకు యత్నించాడని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో తనకు ఎదురవుతున్న అవమానాలను చెబితే అండగా ఉంటానని చెప్పానన్నారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ తరలిస్తామన్నారు. 

కులవివక్షతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు: సర్పంచ్

సర్పంచి లక్ష్మీ మాట్లాడుతూ..  గ్రామంలోని కొందరు కులవివక్షతో ఇబ్బంది పెడుతున్నారని.. నారాయణ పూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తూ తీర్మానం చేయాలని ఇవాళ గ్రామ కార్యదర్శి ముందే వార్డు సభ్యులు తమపై ఒత్తిడి తెచ్చారని లక్ష్మి ఆరోపించారు. అంతేకాదు.. తన భర్త కమీషన్లు తీసుకుంటున్నారని, ముంపునకు గురైన గృహాల వాళ్ల నుంచి డబ్బులు తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పెట్టారని చెప్పారు. ఇలాంటి అవమానాలన్నీ భరించలేకనే తన భర్త ఇవాళ గోలీలు వేసుకుని అత్మహత్యకు యత్నించాడని సర్పంచి లక్ష్మి ఆరోపించారు. 

©️ VIL Media Pvt Ltd.