Reading Time: 2 minutes

ఆధ్యాత్మికం : 12న చుక్కల అమావాస్య.. ఏడాదికి ఒక్కసారే వస్తది.. ఆ రోజు ఇలా చేస్తే దోషాలు పోతాయి..

Caption of Image.

పురాణాల ప్రకారం ప్రతి అమావాస్యకు విశిష్టత ఉంది.  కాని ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉందని పండితులు చెబుతున్నారు.  తెలుగు మాసాల్లో నాలుగో నెల ఆషాఢ మాసం.. చివరి రోజు అమావాస్యతో ముగుస్తుంది.  ఈ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు.  ఈ ఏడాది (2026) అలాంటి పవిత్రమైన రోజు ఆగస్టు 12న వచ్చింది.  ఆరోజున కొన్ని పరిహారాలు చేస్తే అంతా మంచే జరగడమే కాకుండా జాతకంలో దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  ఆరోజు ఎలాంటి నియమాలు పాటించాలి.. ఏం చేయాలో మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

 ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి నేటి జనరేషన్ కు పెద్దగా తెలియదు. అయితే ఈరోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.  

 ఆషాడ మాసంలో  దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. ఆషాడ మాసం చివరి రోజున గంగా స్నానాలు కూడా చేస్తుంటారు. దీపాలను నదులలో వదులుతారు. నీటిలో తమ వారి పేరు మీద వదిలిపెట్టే దీపాలు, తమ వారికి పుణ్యలోకాలకు దారిచూపిస్తాయని భావిస్తుంటారు.

 చుక్కల అమావాస్యనాడు (ఆగస్లు 12) నరదృష్టి దోషాన్ని నిమ్మకాయల ద్వారా తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.  నిమ్మకాయలు నాలుగు భాగాలుగా కోసి తమలపాకు మీద కాస్త ఉప్పు వేసి ఆ నిమ్మకాయ ముక్కలపై పసుపు, కుంకుమ వేసి పెట్టాలి. సాయంత్రం ఏడు గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఇలా ఇంట్లో ఒక మూలన పెట్టడం వల్ల నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. నరదృష్టి తొలగిపోవడంతో దరిద్రం కూడా వదులుతుందని పెద్దలు చెప్తారు

చుక్కల అమావాస్య తరువాత రోజు  నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం..  మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ.. మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజిస్తారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చుక్కల  అమావాస్య రోజున  ( ఆగస్టు 12)  గౌరీపూజ చేసి.. అనంతరం రక్షను ధరిస్తే.. పెళ్ళికాని అమ్మాయిలకు వెంటనే వివాహం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

చుక్కల అమావాస్య రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపారాధన చేయాలి.  ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అనుకోని ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.  పుణ్య నదుల్లో నదీ స్నానం చేయడం .. పేదలకు అన్నదానం.. చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

ఆషాడంలో సూర్యుడు దక్షిణాయనంలోకి మారతాడు. చీకటి అనేది అజ్ఞానానికి అనారోగ్యానికీ చిహ్నాలు. దాన్ని పారద్రోలేందుకు దీపపూజ చేస్తుంటారు. కొంత మంది ఈ రోజు పోయిన తమ బంధువుల పేరుమీద దాన ధర్మాలు, అన్నదానాలు చేస్తారు. అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణం ప్రారంభమవుతుంది. మంచి మూహుర్తాలు కూడా ఉంటాయి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

©️ VIL Media Pvt Ltd.