Reading Time: 2 minutes

పంద్రాగస్టుకు 3 కానుకలు..స్మార్ట్ రేషన్కార్డులు, కొత్త పింఛన్ల పంపిణీకి శ్రీకారం అదే రోజు నుంచి గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి

Caption of Image.
  • ఇప్పటికే జిల్లాలకు చేరిన రేషన్ కార్డులు లక్షల మందికి లబ్ధి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా సంక్షేమ పథకాల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ వేడుకల వేదికగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు, నూతన పింఛన్ల పంపిణీని ప్రారంభించనుంది. దీంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అదే రోజు నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. 
రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా క్యూఆర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌తో కూడిన 1.06 కోట్ల లామినేటెడ్ ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్) రేషన్ కార్డులను ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు తరలించగా, పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులందరికీ పూర్తి స్థాయిలో పింఛన్లు మంజూరు చేయాలని, దివ్యాంగులైన పింఛనుదారులు మరణిస్తే వారి భార్యలకు తక్షణమే ఆ ప్రయోజనం వర్తింపజేయాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు తలసేమియా, సికిల్‌‌‌‌‌‌‌‌సెల్ అనీమియా రోగులకు కూడా సామాజిక పింఛన్లు ఇవ్వాలని 
చెప్పడంతో ఆమేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్పీడప్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,06,28,092 రేషన్ కార్డులు

అధికారిక గణాంకాల ప్రకారం.. 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 54,66,844 కార్డులు, రాష్ట్ర ఆహార భద్రత కింద 35,28,438 కార్డులు కలిపి మొత్తంగా 89,95,282 రేషన్ కార్డులు ఉంటే, వాటిలో 2,81,47,565 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి 2025 నుంచి 21 జులై 2026 మధ్య కాలంలో 16,32,810 కొత్త రేషన్  కార్డులను జారీ చేయడంతో పాటు పాత కార్డుల్లో 20,27,519 కొత్త సభ్యుల పేర్లను చేర్చింది. ఆయా మార్పులు చేర్పులు, సభ్యుల తొలగింపులను మినహాయించి ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,06,28,092 రేషన్ కార్డులు అందుబాటులో ఉండగా, వీటి పరిధిలోని 3,42,57,109 లబ్ధిదారులు ఉన్నారు. ఆయా కుటుంబాలకు లామినేటెడ్ స్మార్ట్ కార్డులను ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయనున్నారు.

సామాజిక భద్రతా పింఛన్ల (చేయూత) కోసం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 వేర్వేరు కేటగిరీలలో ఉన్న 41,35,917 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ. 2,933.35 కోట్ల బడ్జెట్‌‌‌‌ను ప్రభుత్వం కేటాయిస్తోంది.ఇందులో దివ్యాంగులకు నెలకు రూ.4,016 చొప్పున, మిగిలిన 10 విభాగాల లబ్ధిదారులకు నెలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. వర్గాల వారీగా పరిశీలిస్తే.. వృద్ధులు 14,48,301 మందికి, వితంతువులు 14,82,267 మందికి, దివ్యాంగులు 4,74,148 మందికి అందుతున్నాయి. వీరితో పాటు గీత కార్మికులు 59,981 మంది, చేనేత కార్మికులు 34,093 మంది, హెచ్‌‌‌‌ఐవీ, -ఏఆర్‌‌‌‌టీ బాధితులు 47,076 మంది, ఫైలేరియా రోగులు 16,974 మంది, డయాలసిస్ పేషెంట్లు 10,360 మంది, బీడీ కార్మికులు 4,20,499 మంది, ఒంటరి మహిళలు 1,38,459 మంది, బీడీ ఠేకేదార్లు 3,759 మంది ఉన్నారు. వృద్ధాప్య పింఛనుదారుల మరణానంతరం వారి జీవిత భాగస్వాములకు తక్షణమే పింఛను మంజూరు చేసే ప్రక్రియ అమలు కాగా, గత నెలలోనే 3,085 మందికి కొత్తగా అనుమతులు ఇచ్చారు. దివ్యాంగుల పింఛన్ల మంజూరు కోసం ‘యూనివర్సల్ డిసేబిలిటీ ఐడీ అసెస్‌‌‌‌మెంట్’ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం  2.5లక్షల పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీరిలో 6వేల మంది తలసేమియా బాధితులు, 1700 మంది సికెల్​సెల్, ఎనీమియా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.

15 నాటికి గిగ్​వర్కర్స్ సంక్షేమ బోర్డు సేవలు..

దీంతో పాటు డెలివరీ బాయ్స్, రవాణా కార్మికులకు భద్రత కల్పించే గిగ్ వర్కర్ల చట్టాన్ని కూడా ఆగస్టు 15 నుంచే అమలు చేసేందుకు కార్మిక శాఖ సమాయత్తమైంది. డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్ గిగ్ వర్కర్ల భద్రత కోసం ఈ నెల 15 నాటికి సంక్షేమ బోర్డు సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వేతన కోతలు, యాప్‌‌‌‌ల ఆల్గారిథమ్స్ ఆధారిత ఆంక్షలకు సంబంధించి కొత్త చట్టంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను రూపొందించింది. యాప్‌‌‌‌లు, ఆల్గారిథమ్‌‌‌‌ల ద్వారా గిగ్ వర్కర్ల పేమెంట్లు నిలిపివేయడం, కారణం లేకుండా ఐడీలు బ్లాక్ చేయడం, అనవసర కోతలు విధించడం వంటి అగ్రిగేటర్ల చర్యలకు అడ్డు కట్టవేయనుంది. పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయిల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నూతన కార్డులు, పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలు అందించడానికి మండల కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు సాగుతున్నాయి.
 

©️ VIL Media Pvt Ltd.