Reading Time: 1 minute
Ntr Yugapurushudu Amateurish Stroke Dialogue Viral Troll Varun Tej Korean Kanakaraju

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏది ఎందుకు, ఎప్పుడు వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వచ్చిందో, ఎలా తెరమీదకు వచ్చిందో తెలియదు కానీ, సీనియర్ ఎన్టీఆర్ “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అని చెబుతున్న ఒక వీడియో వైరల్ అవుతోంది. దాన్ని ఏకంగా ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో వాడుకున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది కరెక్ట్ కాదని అంటుంటే, ఇది ఆయన్ని ట్రోల్ చేయడం కాదని, ఇమిటేట్ చేయడమే కాబట్టి తాము కించపరిచే ఉద్దేశంతో చేయలేదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు. అసలు “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అనే ఈ సీన్ ఏ సినిమాలోదో, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం!

ఈ సూపర్ హిట్ సీన్ వైజయంతీ మూవీస్ పతాకంపై కె. బాపయ్య దర్శకత్వంలో, సి. అశ్విని దత్ నిర్మించిన ‘యుగపురుషుడు’ (1978) చిత్రంలోనిది. ఇందులో కరాటే ఫైటర్ రాజేష్ పాత్రలో ఎన్టీఆర్, చంద్రమోహన్ మధ్య వచ్చే కరాటే ఫైట్ సీన్ ఇప్పటికీ సినీ అభిమానులకు ఒక మాస్టర్ పీస్. కరాటే ఫైటర్ అయిన రాజేష్ (ఎన్.టి.ఆర్), తన తండ్రి మారుతీరావు (కైకాల సత్యనారాయణ) కోరిక మేరకు ఒక జమిందారు (ప్రభాకర్ రెడ్డి) కోల్పోయిన మనువడు ‘కళ్యాణ్’ స్థానంలోకి వెళ్ళడానికి అంగీకరిస్తాడు. అయితే, రాజేష్‌ను ప్రాణంగా ప్రేమించిన లత (జయప్రద), అతడు డబ్బు కోసం ఇలా నకిలీ మనవడిగా మారాడని భావించి అపార్థం చేసుకుంటుంది.

జమిందారు ప్రాణాలకు ఉన్న ప్రమాదాన్ని గ్రహించి, ఆయనను కాపాడటానికే తాను ఈ నాటకం ఆడుతున్నానని లతకు వివరిస్తాడు రాజేష్. అయితే ఈ క్రమంలోనే ఒక పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. తన చిన్నాన్న జగ్గు (జగ్గయ్య) ద్వారా నిజానికి తానే అసలైన కళ్యాణ్ అనే షాకింగ్ నిజం రాజేష్‌కి తెలుస్తుంది. దీంతో విలన్ల ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టి, వాళ్ళ ఆట కట్టించి, విడిపోయిన తన తల్లిని, తాతను ఒకటి చేస్తాడు. చివరకు తన మరదలు లతను పెళ్ళిచేసుకోవడంతో కథ శుభం కార్డుతో ముగుస్తుంది. ఎన్టీఆర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కె.వి. మహదేవన్ అందించిన మాస్ మ్యూజిక్ మరియు కరాటే బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన డిఫరెంట్ యాక్షన్ సీన్స్ ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించేలా చేశాయి.