
ఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై ఒక బాలిక అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ పరిణామంపై స్పందించారు. జంతర్ మంతర్ దగ్గర జరిగిన నిరసనలో తనను, తన తల్లిని తిట్టిన విద్యార్థులను క్షమించాలని అనుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ కేడర్ ప్రధాని మోదీ ఎంతో పెద్ద మనసు చేసుకుని తనను, తన తల్లిని తిట్టినప్పటికీ విద్యార్థులను క్షమించారని ప్రచారం చేసుకుంటున్నారు.
అయితే.. బీజేపీ నేతలు ఇలా ప్రచారం చేసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ కేడర్ ఎద్దేవా చేసింది. విద్యార్థులను మోదీ క్షమించారని గొప్పగా చెప్పుకుంటున్నారని.. అసలైన క్షమా గుణం అంటే ఇది కాదని చెప్పారు. 1999లో సోనియా గాంధీ తన భర్తను చంపిన వారిని క్షమించారని.. ఈ మేరకు వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదించాలని భారత రాష్ట్రపతికి సోనియా అభ్యర్థన చేశారని.. చివరికి వారందరూ విడుదలయ్యారని.. నిజమైన క్షమాగుణానికి నిలువెత్తు రూపం సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
సోనియా క్షమాగుణంతో పోల్చితే ప్రధాని నరేంద్ర మోదీ క్షమా గుణం ఏపాటిదని కాంగ్రెస్ కేడర్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోదీ ఏదో గొప్ప పని చేసినట్లు ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను, బీజేపీ నేతలు చేస్తు్న్న ప్రచారాన్ని ఏమనాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. నిజానికి.. నిరసనలో భాగమైన విద్యార్థులను టార్గెట్ చేసి కేంద్ర ప్రభుత్వం వేధిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. సోనియా గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ హంతకులను క్షమిస్తూ వారికి విధించిన శిక్ష తగ్గించడానికి తోడ్పడిన విషయం విదితమే. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నళినిని ప్రియాంకా గాంధీ స్వయంగా కలవడం అప్పట్లో సంచలనమైంది.