
భారతీయ పండుగలలో, ముఖ్యంగా శ్రావణ మాసంలో చక్కర పొంగలి ఒక ముఖ్యమైన ప్రసాదం. అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం లాంటి రుచి, సువాసనతో కూడిన చక్కర పొంగలిని ఇంట్లోనే తయారుచేయడం చాలామందికి ఒక సవాలు. అయితే, సరైన కొలతలు, పద్ధతులు పాటిస్తే, ఆ కమ్మని రుచిని మీరు కూడా మీ ఇంట్లో పొందవచ్చు. కాబట్టి ఇంట్లోనే గుడి ప్రసాదం లాంటి చక్కర పొంగలిని ఎలా తయారుచేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు
- బియ్యం: 1 కప్పు
- పెసరపప్పు: 1/2 కప్పు
- బెల్లం పాకం: 2 కప్పులు
- నెయ్యి: 1/2 కప్పు
- నీళ్ళు: 3 కప్పులు
- యాలకుల పొడి: 1 టీ స్పూన్
- పచ్చ కర్పూరం: చిటికెడు
- పచ్చి కొబ్బరి ముక్కలు: సన్నగా తరిగినవి
- జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
- ఎండు ద్రాక్ష: 1 టేబుల్ స్పూన్
చక్కెల పొంగలి తయారీ విధానం
స్టెప్-1: ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం, అర కప్పు పెసరపప్పును తీసుకోండి. వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగి, తగినన్ని నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు, బియ్యం బాగా ఉడికి మెత్తగా తయారవుతాయి.
స్టెప్ -2: ఇప్పుడు నానబెట్టిన పప్పు, బియ్యాన్ని నీళ్ళతో సహా ప్రెషర్ కుక్కర్‌లోకి తీసుకోండి. మూడు కప్పుల నీళ్ళు పోసి, కుక్కర్ మూత పెట్టి, మీడియం ఫ్లేమ్‌లో నాలుగు విజిల్స్ రానివ్వండి. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, ఉడికిన పప్పు, బియ్యాన్ని గరిటెతో మెత్తగా మెదపండి. మరీ ఎక్కువ మెత్తగా కాకుండా, అక్కడక్కడా బియ్యం పలుకులు కనిపించేలా చూసుకోండి.
స్టెప్ -3: ఇప్పుడు పాకం బెల్లం తీసుకోండి, ఇది పొంగలికి మంచి రుచిని ఇస్తుంది. బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక పాన్‌లోకి తీసుకోండి. ఇందులో అర కప్పు నీళ్ళు పోసి, బెల్లం పూర్తిగా కరిగే వరకు సన్నని మంటపై కలుపుతూ ఉండండి. పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ బెల్లం సిరప్‌ను వడగట్టి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే మలినాలు తొలగిపోతాయి.
స్టెప్-4: ఇప్పుడు వడగట్టిన బెల్లం సిరప్‌ను ఉడికించిన పప్పు, బియ్యం మిశ్రమంలో పోయండి. స్టవ్ ఆన్ చేసి, లో ఫ్లేమ్‌లో పెట్టి, బెల్లం సిరప్ పప్పు, బియ్యంలో బాగా కలిసిపోయే వరకు కంటిన్యూస్‌గా కలుపుతూ ఉండండి. బెల్లం సిరప్ పూర్తిగా కలిసిన తర్వాత, అర కప్పు నెయ్యిని పొంగలిలో పోయండి. నెయ్యి వేసిన తర్వాత, లో ఫ్లేమ్‌లో మరో రెండు నిమిషాలు ఉడికించి, బాగా కలపండి. ఇప్పుడు ఒక టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరాన్ని నలిపి వేసుకోండి. పచ్చ కర్పూరం ఎక్కువ వేయకుండా జాగ్రత్తపడండి, లేదంటే దాని రుచి డామినేట్ చేస్తుంది. ఇవన్నీ వేసి బాగా కలపండి.
స్టెప్-5: ఇప్పుడు ఒక వేరే పాన్ స్టవ్ మీద పెట్టి, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి కరిగిన తర్వాత, సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలను వేసి దోరగా వేయించండి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. చివరగా, ఒక టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష వేసి, అవి ఉబ్బినంత వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి.
చివరకు వేయించిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షను నెయ్యితో సహా పొంగలి మిశ్రమంలో వేసి బాగా కలపండి. అంతే, అచ్చం గుడి ప్రసాదం లాంటి కమ్మని, రుచికరమైన చక్కెర పొంగలి సిద్ధం అయినట్టే.. ఈ కొలతలు, విధానాన్ని పాటించి మీరు కూడా మీ ఇంట్లో గుడి ప్రసాదం లాంటి చక్కెర పొంగలిని తయారుచేసి పండుగలప్పుడు ఆస్వాదించండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.