Reading Time: 2 minutes

గ్రాడ్యుయేట్లకు శుభవార్త.. TCS, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ ఏం చేస్తున్నాయంటే?

Caption of Image.

కొంతకాలంగా కనిపించని, వినిపించని క్యాంపస్ హైరింగ్స్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంటున్నాయి. దేశంలోని టాప్ ఐటీ కంపెనీలు 2027 ఆర్థిక సంవత్సరానికి కొత్త టాలెంట్‌ను హైరింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. అయితే ఈసారి నియామకాల విధానం పూర్తిగా మారింది. గతంలో వేల సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను నియమించిన కంపెనీలు.. ఇప్పుడు AIపై అవగాహన ఉండి వెంటనే ప్రాజెక్టుల్లో పనిచేయగల ఇంజినీర్ల కోసం చూస్తున్నాయి. దీంతో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ తిరిగి షురూ చేశాయి. 

ఐటీ కంపెనీలకు ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిసిన ఇంజినీర్లు మాత్రమే అక్కర్లేదు. కస్టమర్ల సమస్యలను అర్థం చేసుకుని, AI ఎనేబుల్డ్ పరిష్కారాలను రూపొందించగల ప్రతిభావంతులైన యువతకు ప్రాధాన్యం పెరుగుతోంది. కొత్త తరం ఇంజినీర్లు ఇప్పటికే AI టెక్నాలజీలపై అవగాహనతో వస్తున్నారనే నమ్మకం కంపెనీల్లో పెరిగిందని టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ డైమండ్‌పిక్ వ్యవస్థాపకుడు శ్రీరామ్ రాజగోపాల్ చెప్పారు. అందుకే ఈ ఏఐ రెడీ టాలెంట్‌ను కొత్త ప్రాజెక్టుల్లో వినియోగించాలని సంస్థలు భావిస్తున్నాయి.

2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే TCS సుమారు 14వేల మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఇన్ఫోసిస్ దాదాపు 4వేల మంది కొత్త గ్రాడ్యుయేట్లను తీసుకుంది. ఇక HCLTech కూడా వెయ్యి 56 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. గత ఏడాది క్యాంపస్ హైరింగ్‌కు దూరంగా ఉన్న టెక్ మహీంద్రా కూడా మళ్లీ నియామకాలు ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆదాయాలపై స్పష్టత పెరగడంతో క్యాంపస్ ప్రోగ్రామ్‌ను పునరుద్ధరిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ALSO READ : 5Gలో కొత్త మార్పులు.. జియో, ఎయిర్‌టెల్ స్లైసింగ్ సేవలకు TRAI గ్రీన్ సిగ్నల్

ఐటీ రంగంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న కొత్త పొజిషన్ ఫార్వర్డ్ డెవల్మెంట్ ఇంజనీర్. ఈ ఉద్యోగంలో కేవలం సాఫ్ట్‌వేర్ రాయటమే మాత్రమే కాకుండా.. కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం, ప్రోడక్ట్ ఆలోచన, AI పరిష్కారాల అమలు వంటి నైపుణ్యాలు అవసరం. టీసీఎస్ దాదాపు 9వేల మంది ఫ్రంటియర్ ఇంజినీర్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ఫోసిస్ కూడా రాబోయే సంవత్సరాల్లో సుమారు 6వేల మందిని, HCLTech ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఫ్రెషర్లను ఎంపిక చేసి వారిని ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని చూస్తున్నాయి.

AI విస్తరణతో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల స్వభావం మారుతోంది. భవిష్యత్తులో విజయవంతమైన ఇంజినీర్ అంటే కేవలం కోడ్ రాసేవాడు కాదు.. వ్యాపార సమస్యలను అర్థం చేసుకుని, కస్టమర్లతో కలిసి పనిచేసి, AI ద్వారా ఫలితాలు అందించగల వ్యక్తిగా మారుతున్నాడు. భారత ఐటీ రంగంలో మరోసారి నియామకాల వేగం పెరగడం గ్రాడ్యుయేట్లకు కొత్త అవకాశాలను తెస్తోంది. ముఖ్యంగా AI నైపుణ్యాలను పెంచుకున్న యువ ఇంజినీర్లకు రాబోయే రోజుల్లో ఉద్యోగ మార్కెట్ మరింత అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

©️ VIL Media Pvt Ltd.