
మనకు రోజూ కనిపించే ట్రాఫిక్ లైట్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు ఉండటం మనకు తెలిసిందే. దాదాపు 100 సంవత్సరాలుగా ఇందులో పెద్దగా మార్పులు రాలేదు. కానీ, ఇప్పుడు డ్రైవర్‌లెస్ కార్లు అంటే ఎవరూ నడపకపోయినా వాటంతట అవే నడిచే కార్లు రోడ్లపైకి వస్తున్నందున, వాటికి తగ్గట్టుగా ట్రాఫిక్ సిగ్నల్స్ మారాల్సిన సమయం వచ్చింది.
కొత్తగా నాలుగో రంగు ఎందుకు?
నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ హజ్‌బబాయీ ఇంకా ఆయన బృందం ట్రాఫిక్ సిగ్నల్స్‌లో తెల్లటి (White) లైటును నాలుగో రంగుగా చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే డ్రైవర్‌లెస్ కార్లు అలాగే సాధారణ డ్రైవర్లు సులభంగా సిగ్నల్స్ అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఎలా పనిచేస్తుంది?
తెల్ల లైటు వెలిగినప్పుడు… “మీ ముందున్న కారును అనుసరిస్తూ ముందుకు వెళ్లిపోండి” అని అర్థం. అంటే సిగ్నల్ మారే వరకు ఆగాల్సిన పని ఉండదు.
లాభాలు: ట్రాఫిక్ లైట్లు సరిగ్గా పనిచేస్తే రోడ్లపై రద్దీ తగ్గుతుంది. దీనివల్ల ప్రజల సమయం, ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు నష్టాలు తగ్గుతాయి. ప్రస్తుతం ట్రాఫిక్ జామ్‌ల వల్ల అమెరికా, యూకే, జర్మనీ దేశాల్లో ఏటా దాదాపు $2.2 బిలియన్ల అంటే 20 వేల కోట్ల నష్టం వస్తోంది.
ట్రాఫిక్ లైట్ ఎప్పుడు పుట్టింది?
ప్రపంచంలోనే మొదటి ట్రాఫిక్ లైట్‌ను 1868లో లండన్ పార్లమెంట్ ముందు పెట్టారు. అప్పట్లో గుర్రపు బగ్గీల రద్దీని నియంత్రించడానికి దీన్ని వాడారు.
ఎలా పనిచేసేది?
ఒక పోలీసు నిలబడి గ్యాస్ లైట్ల (ఎరుపు, ఆకుపచ్చ) సహాయంతో సిగ్నల్స్ ఆపరేట్ చేసేవాడు. అయితే భూమి కింద ఉన్న పైపు నుండి గ్యాస్ లీక్ అయి సిగ్నల్ స్తంభం పేలిపోయి పెద్ద ప్రమాదం జరిగింది. అప్పుడు సిగ్నల్స్ ఆపరేట్ చేస్తున్న పోలీసు గాయపడ్డాడు. దాంతో భయపడి 60 ఏళ్ల పాటు ట్రాఫిక్ లైట్లను నిషేధించారు!
►ALSO READ | జ్యోతిష్యం: కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం.. గురుడు, సూర్యుడు, బుధుడు కలయిక.. నాలుగు రాశుల వారికి అదృష్టయోగం..!
మూడు రంగుల సిగ్నల్ ఎలా వచ్చింది?
1920 తర్వాత విద్యుత్ (కరెంట్) ట్రాఫిక్ లైట్లు అందుబాటులోకి వచ్చాయి. 1921లో విలియం పాట్స్… డెట్రాయిట్‌లో మొట్టమొదటిసారిగా 3-రంగుల (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ) ట్రాఫిక్ లైట్‌ను ప్రవేశపెట్టారు. 1923లో గారెట్ మోర్గాన్.. కరెంట్‌తో పనిచేసే ట్రాఫిక్ సిగ్నల్ కనుగొని, ఆ డిజైన్‌ను ‘జనరల్ ఎలక్ట్రిక్’ కంపెనీకి అమ్మాడు.
ఈ రంగులే ఎందుకు?
సముద్రంలో ఓడలు ఒకదానికొకటి ఢీకొనకుండా రాత్రిపూట ‘ఎరుపు, ఆకుపచ్చ’ లైట్లను వాడేవి. అదే పద్ధతిని రోడ్లకు వాడారు.
పసుపు రంగు ఎందుకు?
లైట్ మారబోతోంది, కాబట్టి స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడానికి పసుపు రంగును తీసుకొచ్చారు.
ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్ని రకాలు?
ప్రస్తుతం మన రోడ్లపై ముఖ్యంగా 4 రకాల సిగ్నల్ వ్యవస్థలు ఉన్నాయి.
ఫిక్స్‌డ్ టైమ్ సిగ్నల్స్: రోడ్డుపై ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా… ముందుగా సెట్ చేసిన టైమ్ ప్రకారం (ఉదాహరణకు ప్రతి 60 సెకన్లకు) లైట్లు మారుతుంటాయి.
సెన్సార్ సిగ్నల్స్: రోడ్డుపై ఉన్న వాహనాల సంఖ్యను సెన్సార్ల ద్వారా గుర్తించి, రద్దీని బట్టి లైట్లు మారుతాయి.
స్మార్ట్ సిగ్నల్స్: ఇది రియల్-టైమ్ డేటాను వాడే అధునాతన విధానం. ఎటువైపు ఎక్కువ ట్రాఫిక్ ఉంటే అటువైపు ఆటోమేటిక్‌గా గ్రీన్ సిగ్నల్ సమయాన్ని పెంచుతుంది.
పాదచారుల సిగ్నల్స్: రోడ్డు దాటేవాళ్లు ఒక బటన్ నొక్కగానే వాహనాలకు రెడ్ సిగ్నల్ పడే వ్యవస్థ.
ట్రాఫిక్ కంట్రోల్‌లో AI వాడకం
భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి AI టెక్నాలజీని వాడబోతున్నారు. మిచిగాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హెన్రీ లియు బృందం దీనిపై పరిశోధనలు చేస్తోంది. రోడ్లపై కెమెరాలు, సెన్సార్లు పెట్టడానికి బదులుగా… డైరెక్ట్ కార్లలో ఉండే GPS డేటాను ఉపయోగించి, రోడ్డుపై ఎంత రద్దీ ఉందో తెలుసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్ ఆటోమేటిక్‌గా మారేలా ప్రయోగాలు చేస్తున్నారు.
సింపుల్ గా చెప్పాలంటే గ్యాస్ లైట్లతో మొదలైన ట్రాఫిక్ సిగ్నల్ ప్రయాణం… ఇప్పుడు AI టెక్నాలజీ వైపు ఇంకా డ్రైవర్‌లెస్ కార్ల కోసం నాలుగో రంగు అంటే తెల్ల రంగు సిగ్నల్ లైట్ వైపు అడుగులు వేస్తోంది.